ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో రాజకీయ వేడి పెరుగుతోంది. త్వరలోనే ఇక్కడ మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్టు ఇరు పార్టీల నాయకులు కూడా అంచనా వేస్తున్నారు. తాజాగా ఇక్కడ ఇరు పార్టీల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం.. ఇటు ఎమ్మెల్యే రాము వర్గాలు కూడా.. దాడికి పాల్పడ్డాయి.
రీజనేంటి?
మునిసిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్నది వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి పట్టు. అయితే.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకుని, రాష్ట్రంలోనే టాక్ ఆఫ్‌ది సెంట్రిక్‌గా నిలిచిన తన పట్టు నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇరు పార్టీల్లోనూ పంతాలు, పట్టింపులకు దారి తీసింది. టీడీపీ చేపడుతున్న ప్రచార కార్యక్రమాల సమయంలో వైసీపీ నేతలు రంగంలొకి దిగుతున్నారు. ఇక, వైసీపీ ఏ వార్డులో అయితే ప్రచారం చేస్తోందో తెలుసుకుని టీడీపీ కార్యకర్తలు అదే వార్డులో ప్రచారానికి దిగుతున్నారు.
రోడ్‌షోలలోనూ ఇరు వర్గాలు పోటా పోటీగా ఒకే వీధుల్లో చేపడుతున్నారు. దీంతో ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. టీడీపీ నేతలు వైసీపీ జెండాల తగలబెడుతుంటే.. వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలను చింపేస్తు న్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కొన్ని కొన్ని వార్డుల్లో పికెట్‌లు ఏర్పాటు చేశారు. కేవలం అభ్యర్థులు.. ఓ ఐదుగురు అనుచరులను మాత్రమే అనుమతిస్తున్నా రు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కొడాలి ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం లేదు. కానీ, ఆయన తెరవెనుక ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారన్న వాదన ఉంది.
మరో తాడిపత్రి!
ఈ పరిణామాలను గమనిస్తున్న వారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో మాదిరిగా ఇక్కడ కూడా నిరంతరం ఘర్షణలు జరుగుతాయా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న రాజకీయాలు నిత్యం చూస్తున్న నేపథ్యంలో గుడివాడలోనూ మునిసిపల్ ఎన్నికల వేళ ఇలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates