వైస్ చైర్మన్ల పోరు.. జనసేనలో ఏం జరుగుతుంది?

రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఉత్తరాంధ్ర నుంచి పల్నాడు వరకు, కోస్తా నుంచి రాయలసీమ వరకు రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లోను పదవుల పండుగ జరిగింది. జాతరలా జరిగిన ఈ కార్యక్రమంతో ఆయా పార్టీల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో అయితే మరింత పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే అక్కడక్కడా కొంత డిస్ట్రబ్ జరిగింది. పలు మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకదశలో ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గా దానం లాజరు బాబు ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా జరిగింది. వైస్ చైర్మన్ విషయం దగ్గరకు వచ్చేసరికి గొడవ మొదలైంది.

వైస్ ఛైర్మన్ పదవి కోసం బొజ్జ వెంకటేశ్వరరావు, పిండి సంధ్య వర్గాలు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి.  మేమంటే మేమంటూ ఇరు వర్గాలు పట్టు పడ్డాయి. అయితే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడు చక్రి వల్లనే సమస్య తలెతిందని జనసేన నాయకులు ఆరోపిస్తూ రచ్చ రచ్చ చేశారు. ఒక దశలో నిగ్రహం కోల్పోయిన నాయకులు చక్రి మీద దాడికి పాల్పడేందుకు ప్రయత్నం చేశారు. 

వెంటనే అప్రమత్తమైన జనసేన నాయకులు చక్రిని తప్పించి కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. కాసేపటికి పరిస్థితి చల్లారింది.  ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇరు వర్గాలను బుజ్జగించడంతో రాజీకి వచ్చారు. పిండి సంధ్యకు అనుకూలంగా ప్రతిపాదన చేసిన కౌన్సిలర్ రాగండి ప్రభాకర్ వెనక్కి తగ్గారు. చివరికి బొజ్జ వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

కృష్ణా జిల్లా ఉయ్యూరులో కూడా జనసేన వర్గాల మధ్య ఫైటింగ్ జరిగింది. ఇక్కడ తొలుత ఒకరికి ఓకే చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రమాణస్వీకారం దగ్గరకు వచ్చేసరికి మరొకరు తెరమీదకు వచ్చారు. దాంతో జనసైనికులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వైస్‌ఛైర్మన్ పదవి కోసం తొలుత గంగాభవాని పేరును ప్రకటించగా, అనూహ్యంగా చిన్న కోటయ్య పేరు తెరపైకి వచ్చింది. దీంతో సభ్యుల మధ్య వివాదం మొదలైంది. ఇరు వర్గాలు చొక్కా మడతేసి కాలర్లు పట్టుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన వచ్చింది.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎన్నిక విషయంలో టీడీపీ, జనసేన మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. దాంతో అక్కడ ఎన్నిక వాయిదా వేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపలిటీ వైస్ ఛైర్మన్ పదవిపై కూడా టీడీపీ, జనసేన మధ్య వివాదం నెలకొంది. ఇక్కడ జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురంలో ముస్లిం మైనారిటీ నాయకుడికే వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ముస్లింలు ధర్నాకు దిగారు. మొత్తం మీద స్వల్ప సంఘటనలు మినహా ఉల్లాసభరిత వాతావరణంలో పుర పాలకులు బాధ్యతలు చేపట్టారు.