మిత్రపక్షాల సత్తా తేలిపోతుందా ?

అవును మిత్రపక్షాలైన జనసేన, బీజేపీల అసలైన సత్తా ఏమిటో తెలిపోతుంది. పంచాయితీల ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని, వీలైనన్ని పంచాయితీలను గెలుచుకోవాలనే వ్యూహంతో రెండుపార్టీల నేతలు గట్టిగా డిసైడ్ అయ్యారు. మంగళవారం జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తో బీజేపీ చీఫ్ సోమువీర్రాజు భేటీ సందర్భంగా ఈ విషయాన్ని నిర్ణయించారు. అన్నీ పంచాయితీలకు తమ రెండు పార్టీల తరపున నామినేషన్లు వేస్తారని నాదెండ్ల ఓ ప్రకటన జారీ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజానికి రెండుపార్టీలకు క్షేత్రస్ధాయిలో పెద్దగా బలం లేదనే చెప్పాలి. జనసేన పెట్టి దాదాపు ఏడేళ్ళయినా ఇంతవరకు ఏస్ధాయిలో కమిటిలే ఏర్పాటు కాలేదు. పార్టీకి పట్టుకొమ్మలాంటి గ్రామస్ధాయి కమిటిలే ఏర్పాటు కాకకపోతే ఇక క్షేత్రస్ధాయిలో బలమెంత అన్న విషయం తెలిసే అవకాశమే లేదు. ఇక బీజేపీ విషయం చూస్తే రాష్ట్రస్ధాయి కమిటి ఏర్పాటయ్యింది కానీ జిల్లా, మండల, గ్రామకమిటిలు లేవు.

బీజేపీలో సమస్య ఏమిటంటే ఇన్ని కమిటీల్లో నియమించటానికి నేతలు కూడా లేరు. అందుకనే రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరున్నా రాష్ట్రకమిటిని నియమిస్తున్నారే కానీ మిగిలిన కమిటిల జోలికి పెద్దగా వెళ్ళటం లేదు. అలాంటి రెండుపార్టీలు కలిసి ఇఫుడు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ చేశాయి. నిజానికి పంచాయితీ ఎన్నికల్లో పార్టీల బ్యానర్ ఉండకపోయినా పోటీ చేసే వ్యక్తి ఏ పార్టీ నేత అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది.

నాలుగు దశల్లో జరగబోతున్న పంచాయితీ ఎన్నికల్లో సుమారు 13 వేల పంచాయితీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వమేమో వీలైనన్ని పంచాయితీలు ఏకగ్రీవం అవ్వాలని నగదు బహుమతులను కూడా ప్రకటించింది. ఎలక్షన్ కమీషన్ ఏమీ ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. అందుకనే ఏకగ్రీవాలయ్యే పంచాయితీలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఒకవేళ నేతల మధ్య సమన్వయంతో ఏకగ్రీవాలైనా కమీషనర్ అంగీకరించకపోతే ఎన్నికలు జరగాల్సిందే.

సో ఇటువంటి పరిస్ధితుల నేపధ్యంలో నాదెండ్ల మాట్లాడుతూ ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలకే తమ నేతలు మొగ్గు చూపుతారని స్పష్టం చేశారు. కాబట్టి బీజేపీ+జనసేన నేతల క్షేత్రస్ధాయి బలమెంత అన్నది పంచాయితీ ఎన్నికల సాక్షిగా తేలిపోతుంది. మరి పంచాయితీ ఎన్నికలు మిత్రపక్షాలకు లాభం చేకూరుస్తుందో లేకపోతే నష్టం జరుగుతుందో చూడాలి.