జ‌గ‌న్‌తో క‌మీష‌న్ల బేరం: కేసీఆర్‌పై రేవంత్ ఫైర్‌!!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న.. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కులు, రైతుల హ‌క్కులు స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌తో క‌మీష‌న్ల కోసం బేరం కుదుర్చుకున్నార‌ని ఆరోపించారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోతల ప్రాజెక్టును జ‌గ‌న్ ప్ర‌తిపాదిస్తే.. దీనికి త‌గుదున‌మ్మా అంటూ.. ఒప్పుకోవ‌డం వెనుక క‌మీష‌న్ల వ్య‌వ‌హారం ఉంద‌న్నారు. తెలంగాణ రైతుల డొక్క మాడ్చేలా ఈ క‌మీష‌న్ల వ్య‌వ‌హారం సాగింద‌ని దుయ్య‌బ‌ట్టారు.

జ‌గ‌న్‌ను ఆనాడు ఇంటికి పిలిచి.. భోజ‌నాలు వ‌డ్డించి.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల క‌ట్టుకోమ‌ని చెప్పింది కేసీఆర్ కాదా? బేరాలు కుదుర్చుకున్నది తండ్రీకొడుకులు(కేసీఆర్‌, నాటి మంత్రి కేటీఆర్‌) కాదా? అని నిల‌దీశారు. తెలంగాణ రైతుల‌కు మ‌ర‌ణ శాస‌నం రాశార‌ని.. ఒప్పందాల‌పై సంత‌కాలు పెట్టి అన్యాయంగా గొంతు కోశార‌ని వ్యాఖ్యానించారు. సాగునీటి విష‌యంలో అబ‌ద్ధాలు, పోసుకోలు క‌బుర్లు ప్ర‌చారం చేస్తే.. మామా అల్లుళ్ల‌ను(కేసీఆర్‌, హ‌రీష్‌రావు) చేప‌ల‌ను రుద్దిన‌ట్టు రుద్దుతామ‌ని సీఎంరేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. నాడు కేంద్ర మంత్రి ఉమాభార‌తి, ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో కేసీఆర్‌(తొలి ఐదేళ్ల‌పాల‌న‌) చేసుకున్న ఒప్పందాల కార‌ణంగానే తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు.

నా త‌ల్లికి అన్యాయం చేస్తానా?

తెలంగాణ‌ను త‌న త‌ల్లిగా అభివ‌ర్ణించిన సీఎం రేవంత్‌.. త‌న త‌ల్లికి అన్యాయం చేస్తానా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌జాపాల‌న కావాలో.. పాపాల భైర‌వుడి(కేసీఆర్‌) పాల‌న కావాలో తేల్చుకోవాల‌ని అన్నారు. బీఆర్ ఎస్‌కు గ‌త‌మే త‌ప్ప భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని.. లేద‌ని వ్యాఖ్యానించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప్ర‌జ‌లు కేసీఆర్‌పై న‌మ్మ‌కంతో గెలిపించి పార్ల‌మెంటుకుపంపిచార‌ని.. త‌ద్వారా త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆశించార‌ని అన్నారు. కానీ, కేసీఆర్ పార్ల‌మెంటుకు వెళ్లి.. న‌ల్గొండ‌-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్రాజెక్టుల‌పై ఒక్క మాట కూడామాట్లాడ‌లేద‌ని..ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను అణిచేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

కేటీఆర్‌పై..

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రికేటీఆర్‌పైనా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్‌కు గ‌డ్డం వ‌చ్చేందుకు 50 ఏళ్లు ప‌ట్టింద‌న్న ఆయ‌న‌.. బుద్ధి వ‌చ్చేందుకు ఇంకెన్నేళ్లు ప‌డుతుందోన‌ని వ్యాఖ్యానించారు. ఆస్తుల్లో వాటాలు ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని సొంత చెల్లిని ఇంటి నుంచి బ‌య‌ట‌కు గెంటేసిన వ్య‌క్తి కేటీఆర్ అని మండిప‌డ్డారు. ఇలాంటి వారు మ‌హిళ‌ల‌కు ఏదో చేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నార‌ని ఎద్దేవా చేశారు. సొంత త‌ల్లికి అన్నం పెట్ట‌నివాడు.. పిన్న‌మ్మ‌కు బంగారు క‌డియం చేయిస్తాన‌న్న‌ట్టుగా కేటీఆర్ వ్య‌వ‌హార శైలి ఉంద‌న్నారు.