రాంబాబు సవాల్… పవన్ సైలెంట్

ప్రకాంశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ ఎంఎల్ఏ అన్నా రాంబాబు ఇచ్చిన కౌంటర్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు పడిపోయిందా ? అనే డౌటు పెరుగుతోంది. గిద్దలూరులో ఎంఎల్ఏ+ మద్దతుదారుల వేధింపుల వల్లే తమ కార్యకర్త వెంగయ్యనాయుడు ఆత్మహత్య చేసుకున్నారంటూ పవన్ కల్యాణ్ పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఒంగోలుకు వెళ్ళి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా అనవసరమైన చాలెంజ్ చేశారు పవన్.

వచ్చే ఎన్నికల్లో రాంబాబును అసెంబ్లలోకి అడుగుపెట్టనివ్వనన్నారు. రూ. 350 కోట్లు ఖర్చుచేసిన రాంబాబును ఓడించే బాధ్యత తాను తీసుకుంటానంటూ భారీ డైలాగులే చెప్పారు పవన్. ఇదే విషయమై రాంబాబు మాట్లాడుతూ గిద్దలూరులో తనపై పోటీకి పవన్ రెడీ అంటే వెంటనే తాను రాజీనామా చేస్తానంటూ చాలెంజ్ విసిరారు. జనసేన కార్యకర్తను తాను వేధించలేదని స్పష్టంచేశారు. ఉపఎన్నికల్లో తాను ఓడిపోతే చేయని తప్పుకు న్యాయస్ధానం ముందు లొంగిపోయి ఎటువంటి శిక్షకైనా సిద్ధమన్నారు.

ఒకవేళ పవన్ ఓడిపోతే జనసేన పార్టీని రద్దు చేసుకుని తప్పుడు ఆరోపణలు చేసినందుకు జనాలను పవన్ క్షమాపణ అడుగుతారా ? అంటూ సవాలు విసిరారు. నిజంగా ఎంఎల్ఏ విసిరిన సవాలు సబబుగానే ఉందనటంలో సందేహం లేదు. రాంబాబును వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని, అసెంబ్లీలోకి అడుగుపెట్టనిచ్చేది లేదన్న పవన్ చాలెంజ్ కి రాంబాబు ఇఫ్పుడే రెడీ అంటున్నారు. మరి పవన్ ఇంకా ఎందుకని మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్ధం కావటం లేదు.

నిజంగానే ఒకళ్ళని ఓడించేంత సీనే పవన్ కుంటే మరి వెంటనే ఎంఎల్ఏ సవాలును స్వీకరించాలి కదా. పైగా తన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి కూడా రావక్కర్లేదని ఎంఎల్ఏ చెబుతున్నారు. జగన్ ఫొటో పెట్టుకుని తన ప్రచారం తానే చేసుకుని గెలుస్తానని చాలెంజ్ చేశారు. ఇంతకన్నా బంపర్ ఆఫర్ పవన్ కు ఎవరూ ఇవ్వరు. ఇఫ్పుడు గనుక రాంబాబు చాలెంజ్ ను స్వీకరించకపోతే పవన్ను ముందు ముందు ఎవరూ నమ్మరు.

వాళ్ళని అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వను, వాళ్ళని గెలవనివ్వనంటూ చాలెంజ్ చేయటం పవన్ కు బాగా అలవాటు. అయితే ఎవ్వరినీ అడ్డుకునేంత సీన్ పవన్ కు లేదని మొన్నటి ఎన్నికల్లోనే తేలిపోయింది. జగన్ను సీఎంను కానివ్వనని చాలెంజ్ చేశారు. జగన్ సీఎం ఎలా అవుతాడో చూస్తానంటూ చాలా చోట్ల చాలెంజులు చేశారు. ఏమైంది చివరకు ? 151 సీట్ల అఖండ విజయంతో జగన్ సీఎం అయితే పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయారు. పవన్ ఓడిపోయిన రెండుచోట్ల వైసీపీ అభ్యర్ధుల చేతిలోనే. మరప్పుడు ఎవరిని ఎవరు అడ్డుకున్నట్లు ?