అమెరికా ఎన్నికలు – ట్రోలింగ్ అవుతున్న జ్ఞానేష్

అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాల్లో అధికారంలో వున్న ట్రంప్ పార్టీ ఓటమి పాలయ్యింది. తగువులమారి తెంపరి ట్రంప్ కు తలబొప్పి కట్టింది. ఎక్కడో అమెరికాలో ఎన్నికలు జరిగి ప్రెసిడెంట్ ట్రంప్ పార్టీ ఓడిపోతే ఇక్కడ ఇండియాలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుర్తు చేసుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ట్రంప్‌ను వెక్కిరించేలా రూపొందించిన ఏఐ వీడియోలు, ఫొటోలతో ట్రోలర్లు సోషల్‌ మీడియాలో రెచ్చిపోయారు. భారతదేశంలో కొన్ని నెలలుగా ఓట్ చోరీ గురించి ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో మోదీ వరస విజయాల వెనక జ్ఞానేష్ కుమార్ చేతివాటం వుందని కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీలు పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ఫలితాలు వారికి అందివచ్చినట్టయ్యింది. జ్ఞానేశ్‌కుమార్‌ అయితే ట్రంప్‌కు ఇలా జరగనిచ్చేవారు కాదంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో పోస్టు చేశారు. మిత్రమా ట్రంప్‌.. జ్ఞానేష్ ను నీ దగ్గరకు పంపలేకపోయినందుకు క్షమించంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక జ్ఞానేష్ కుమార్ ను జైలుకు పంపిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా ఎన్నికలపై స్పందించారు. అమెరికా తరహా మార్పు ఇండియాలో కూడా సాధ్యమే అని చెప్పారు. యెస్.. వి కెన్ టూ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ లో మెసేజ్ పెట్టి తమ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. భారత్‌లోనూ ఇలాంటి రాజకీయ మార్పు త్వరలోనే వస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శామా మహమ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

మొత్తమ్మీద దేశంలో ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారని, మోదీ, అమిత్ షా కంటే ఎక్కువ క్రేజ్ వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.