స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ఆలోచన ప్రకారం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు షెడ్యూల్ అమల్లోకి వస్తే ముందుగా 11 జిల్లాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు జరగటం లేదు. ఎందుకంటే పోయిన ఏడాది మార్చిలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలను, ఘర్షణలను నివారించలేకపోయిన కారణంగా పై జిల్లాల కలెక్టర్లపై నిమ్మగడ్డ చర్యలకు సిఫారసు చేశారు. అయితే వాళ్ళపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఒకవైపు చర్యలకు సిఫారసు చేసిన నిమ్మగడ్డ వెంటనే అప్పట్లో జరుగుతున్న ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదావేశారు.
ఎటూ ఎన్నికలు జరగటం లేదు కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో లేదు కాబట్టి నిమ్మగడ్డ సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఇపుడు మళ్ళీ పంచాయితి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్న నిమ్మగడ్డ ముందుగా ఆ రెండు జిల్లాల కలెక్టర్లపై వేటు వేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. అయితే ఆ ఇద్దరు కలెక్టర్లు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో బిజీగా ఉన్న కారణంగా వాళ్ళపై వేటు వేయటం సాధ్యంకాదని తేల్చిచెప్పింది ప్రభుత్వం. దాంతో ఆ ఇద్దరు కలెక్టర్లు బాధ్యతల్లో ఉన్న కారణంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టేసింది.
పై రెండు జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లోని ఒక్కో రెవిన్యు డివిజన్లోనే ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ డిసైడ్ చేసినట్లు సమాచారం. శనివారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. జారీ అయ్యే నోటిఫికేషన్లో వివరాలుంటాయని ప్రభుత్వం యంత్రాంగం అనుకుంటోంది. 11 జిల్లాల్లో ఎన్నికలు జరగబోయే 11 డివిజన్లు ఏవనే విషయం అప్పటి వరకు సస్పెన్సుగానే ఉంటుంది. అలాగే మిగిలిన డివిజన్లలో ఎప్పుడు ఎన్నికలు జరగబోయేది కూడా నోటిఫికేషన్లోనే స్పష్టం చేయబోతున్నారు.
మొత్తంమీద జిల్లాలో ఒక రెవిన్యు డివిజన్లో మాత్రమే ఎన్నికలన్నది గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవనే అంటున్నారు. ఎన్నికలంటూ జరిగితే మొత్తం జిల్లా అంతా ఒకేసారి జరుగుతుంది. కాకపోతే ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని నిమ్మగడ్డ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం వస్తోంది. ఏదేమైనా నోటిఫికేషన్ జారీ సమయంలో ఆయనే క్లారిటి ఇస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates