దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఓ ప్రముఖ సంస్థ దేశంలోని ముఖ్యమంత్రుల మీద సర్వే నిర్వహించి ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు స్థానం లభించడం విశేషం.
ఫేమ్ ఇండియా మ్యాగజైన్ – ఆసియా పోస్ట్ సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించింది. సుపరిపాలన, శాంతి భద్రతలు, ప్రజాదరణ, దూరదృష్టి, పనితీరు వంటి 10 అంశాలను తీసుకొని 1000 మార్కులు కేటాయించింది. ఈ సర్వేలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ 897 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ 881 పాయింట్లతో రెండో స్థానం, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ 874 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురూ బీజేపీ ముఖ్యమంత్రులు కావడం గమనార్హం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ 856 పాయింట్లతో నాలుగో స్థానం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 844 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 842 పాయింట్లతో ఆరో ర్యాంకు సాధించగా సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ 838 పాయింట్లతో ఏడో స్థానం సాధించారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 827 పాయింట్లతో ఎనిమిదో ర్యాంకును దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా వరసగా తొమ్మిది, పది ర్యాంకులు పొందారు.
గురు శిష్యులుగా పేరున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ సర్వేలో స్థానం పొందడం చర్చనియాంశంగా మారింది. దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన చంద్రబాబుకు గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సర్వేల్లో అగ్రస్థానంలో నిలిచిన సందర్భాలు వున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates