ఓటేయకుండా బెంగళూరు వెళ్ళిపోయిన జగన్

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం వుంది. అయితే బాధ్యాయుతమైన ఒక ప్రతిపక్ష నాయకుడు ఓటు వేయకుండా వెళ్లిపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నాయకుడు మరెవరో కాదు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు పులివెందుల వచ్చిన ఆయన పోలింగ్ జరుగుతున్న తీరు మీద ఆరోపణలు చేశారు. నేను ఓటు వేయనని చెప్పి తిరిగి వెళ్లిపోయారు. జగన్ తీరు మీద విమర్శలు వినిపిస్తున్నాయి. 

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆదివారం బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చారు. సొంత నియోజకవర్గంలో హెలికాప్టర్ దిగినప్పటి నుంచే ఆయనకు షాకుల మీద షాకులు తగలడం మొదలయ్యాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి దారి మధ్యలో జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి చిన్నగా నివాసానికి చేరుకున్నారు. స్థానిక నాయకులు పోలింగ్ జరుగుతున్న తీరు వివరించారు. ఈసారి మనం పులివెందులలో ఓడి పోతున్నామని చెప్పారు. దాంతో ఏమి చేయాలో ఆయనకు పాలుపోలేదు. 

వైసీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి అనుమటించలేదని కొందరు ఫిర్యాదు చేశారు. అంతే  మీడియా ముందుకు వచ్చి పోలింగ్ అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద బురదజల్లేందుకు ప్రయత్నం చేశారు. ఆయనకు ఒక్క నిముషం కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

ఇలాంటి పరిస్థితులు వున్నప్పుడే కాక్రోచ్ లు పుట్టుకొస్తుంటారని చెప్పారు.

అంతటితో ఊరుకోలేదు. వైసీపీ అజెంట్లతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పులివెందులలో మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తాను, లేకపోతే లేదని కుండబద్దలు కొట్టారు. మధ్యాహ్నం తర్వాత హెలికాప్టర్ ఎక్కి బెంగళూరుకు వెళ్లిపోయారు. ప్రజాప్రతినిధిగా ఉన్న జగన్.. ఓటు హక్కు వినియోగించుకోకుండా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రజాస్వామ్యవాదులు, అధికార కూటమి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఇటు జగన్ ఏమో.. ఎన్నికలు అన్యాయంగా జరుగుతున్నాయని, ఇప్పుడు నేను ఓటు వేస్తే అంత సవ్యంగా జరుగుతున్నట్టు ఒప్పుకున్నట్టు అవుతుందని నొక్కి చెప్పారు.