తొలి ఓటు బాల‌య్య‌తోనే

ఏపీలో జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అంతేకాదు.. యువ‌త స‌హా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు కూడా వ‌చ్చి ప్ర‌జాస్వామ్యం క‌ల్పించిన ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని ప‌లువురు పిలుపునిచ్చారు. వీరిలో న‌ట‌సింహం, హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ముందువ‌రుస‌లో ఉన్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం మునిసిప‌ల్ చైర్మ‌న్ స్థానానికి జ‌రుగుతున్న పోలింగ్‌లో పాల్గొన్నారు.

త‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌తో క‌లిసి బాల‌కృష్ణ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ నేప‌థ్యంలో ఒక రోజు ముందుగానే సొంత నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకున్న బాల‌య్య‌.. ఆదివారం ఉద‌య‌మే త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. స్థానిక చౌడేశ్వ‌రి కాల‌నీలో ఉన్న పోలింగ్‌ బూత్‌లో నంద‌మూరి బాల‌య్య దంప‌తులు ఓటు వేశారు. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. బాల‌య్య స్థానికంగానే ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్య‌ర్థి.. తొలి ఓటు బాల‌య్యే వేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

దీంతో బాల‌య్య దంప‌తులు ఈ బూత్‌లో తొలి ఓటు వేసి పోలింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. కాగా.. హిందూపురం మునిసిప‌ల్ చైర్మ‌న్ టీడీపీ అభ్య‌ర్థి పి. ఎస్. మంజునాథ్ (పురిడి మంజునాథ్) పోటీ చేస్తున్నారు. ఈయ‌న నందమూరి బాలకృష్ణకు స‌న్నిహితుడుగా పేరుంది. బాల‌య్య సూచన మేరకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు మంజునాథ్‌కు అవ‌కాశం క‌ల్పించార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, పోలింగ్ ప్రక్రియ హిందూపురంలో ప్ర‌శాంతంగా సాగుతోంది. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేద‌ని పోలీసులు తెలిపారు.

రండి ఓటేయండి..

యువ‌త స‌హా ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని బాల‌య్య దంపతులు పిలుపునిచ్చారు. హిందూపురంలోని చౌడేశ్వ‌రి కాల‌నీలో ఓటు వేసిన అనంత‌రం.. మీడియాతో మాట్లాడారు. ప్ర‌జాస్వామ్యంలో ఓటు హ‌క్కు అత్యంత ప‌విత్ర‌మైంద‌న్నారు. సుప‌రిపాల‌న అందించే వారిని ప్రోత్స‌హించాల‌ని సూచించారు. అభివృద్ది, సంక్షేమానికి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం ద్వారానే ప్ర‌జలు స‌రైన నాయ‌కుడిని ఎంచుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఓటును స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.