ఇలాంటి వాల్లని ఉరి తీయాలి

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి క్లాస్ జరుగుతోంది. మ్యాథ్స్ క్లాస్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా దుండగుడు వచ్చి ఒక విద్యార్థినిపై చెట్లు కోసే రంపం మిషన్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో మరో విద్యార్థిని కాలికి గాయాలయ్యాయి. ఆ ఉన్మాదిని పోలీసులు ధర్మవరం దగ్గర అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. బాధిత బాలికకు ఆ సైకో సమీప బంధువు అని తెలుస్తోంది. ఈ అరెస్టుపై పోలీసులు అధికారిక సమాచారం వెల్లడించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. బాధిత బాలికలకు జరిగిన అన్యాయం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలికల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఈ ఘటన తనకు దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

ఈ ఘటనపై లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి చెల్లిని నెత్తుటి మడుగులో చూసిన తర్వాత కన్నీళ్లు ఆగడం లేదని, గుండె బరువెక్కిందని అన్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఉన్మాదిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనపై హొం మంత్రి అనిత స్పందించారు. రంపంతో దాడి చేయడం అత్యంత పాశవికం అని మండిపడ్డారు. ఇది క్షమించరాని నేరం అని అన్నారు. బడికి వెళ్లిన ఆడబిడ్డలపై ఇలాంటి దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామన్నారు. ఆడబిడ్డల భద్రత విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు. బాధిత బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు.

ఇలాంటి సైకోలకు జైలు కాదు.. ఉరి శిక్ష వేసిన తక్కువేనని, అత్యంత కఠినమైన శిక్ష విధిస్తేనే ఇలా చెయ్యాలనే ఆలోచనలు భవిష్యత్తులో ఎవరికి రావు అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.