తెలంగాణలో నెలకొన్న నీటి ఎద్దడి, కరువు ప్రభావిత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నీటికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో నీటి దుర్వినియోగాన్ని అరికడుతోంది. స్టార్ హోటళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్న పరిస్తితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్న ప్రభాకర్.. ‘పానీ’ పేరుతో సరికొత్త యాప్ ను ఆవిష్కరించారు. ఇది.. హైదరాబాద్ నగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని, వృథాను అరికట్టడం కోసం హైదరాబాద్ జలమండలి ప్రత్యేకంగా రూపొందించిన ఒక వినూత్న మొబైల్ అప్లికేషన్.
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా తాగునీటిని సంరక్షించడం, పైప్‌లైన్ లీకేజీలు, ప్రజలు చేసే నీటి వృథాను అరికట్టడంలో సాధారణ పౌరులను భాగస్వాములను చేయడం ఈ యాప్ ముఖ్య లక్ష్యం. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకుని.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైనా రోడ్లపై నీటిని వృథా చేసినా, పైప్‌లైన్ లీకేజీలు ఉన్నా, ఓవర్‌ఫ్లో ట్యాంకులు లేదా వాణిజ్య అవసరాలకు తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నా.. ప్రజలు ఈ యాప్ ద్వారా వాటిని ఫొటోలు లేదా వీడియోలు తీసి అప్‌లోడ్ చేయవచ్చు.
పానీ యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటోల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆ లొకేషన్‌ను, సంబంధిత నివాసాన్ని అధికారులు గుర్తిస్తారు. నీటిని వృథా చేసినట్లు ఆధారాలతో రుజువైతే, సంబంధిత యజమానికి వారి నెలవారీ నల్లా బిల్లులోనే నేరుగా భారీ జరిమానాలను విధిస్తారు. నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్న ఏ పౌరుడైనా ఈ యాప్ ద్వారా ‘సేవ్ వాటర్ వాలంటీర్’గా నమోదు చేసుకోవచ్చు. ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతల ఆవశ్యకతను తెలియజేస్తూ, తాగునీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates