తాజాగా సంభవించిన ఆర్నబ్ తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో జరిగిన నష్టం.. సుమారు 4600 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయినప్పటికీ.. భయం లేదని.. అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కొబ్బరి చెట్ల నుంచి ఇళ్ల వరకు, పశువుల నుంచి ఇతర జీవాల వరకు నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తుఫాను కారణంగా జరిగిన నష్టం పై ప్రాథమిక సమాచారం తెప్పించుకుని నష్టపరిహారాన్ని అందించే కార్యక్రమం చేపడతామన్నారు.
తాజాగా గురువారం సాయంత్రం వరకు ఆయన కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి వంటి తుఫాను ప్రభావిత జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. తుఫాను బీభత్సాన్ని ముందుగానే ఊహించామని చెప్పారు. టెక్నాలజీ సాయంతో ముందుగానే అంచనా వేయడం వల్ల.. ప్రాణనష్టం జరగకుండా చూశామన్నారు. ఈ విషయంలో అధికారులను చంద్రబాబు అభినందించారు. సమయ స్ఫూర్తిగా వ్యవహరించి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారని ప్రశంసించారు.
కేంద్రం నుంచి సాయం
ఆర్నబ్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఏపీలోని జిల్లాల వివరాలను.. నష్టాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈ విషయంపై చర్చించామని తెలిపారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు. సహాయక బృందాలను కూడా పంపుతోందని చెప్పారు. అలాగే నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు కూడా రానున్నాయని.. వారికి సమగ్ర సమాచారం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
48 గంటలు తప్పదు!
కోనసీమ సహా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామాలపై స్పందించిన చంద్రబాబు దాదాపు 48 గంటల్లో అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లోనే విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని.. మరికొన్ని గ్రామాలకు 48 గంటల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అధికారులు సమన్వయంతోనే పనిచేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates