కొన్ని రోజులు పుల్లారెడ్డి స్వీట్లను మర్చిపోండి

తింటే గారెలు తినాలి.. అలానే పుల్లారెడ్డి స్వీట్స్ తినాలి! అంటూ దాదాపు 50 ఏళ్లుగా తెలుగు వారి నోటిని తీపి చేస్తున్న పుల్లారెడ్డి స్వీట్స్‌కు ఖండాంత‌రాల్లోనూ ఖ్యాతి ఉంది. కేవ‌లం సాధార‌ణ పౌరుల‌కు మాత్ర‌మే కాదు.. అధికారికంగా.. ప్ర‌భుత్వాల‌కు కూడా పుల్లారెడ్డి స్వీట్స్‌కు అనుమ‌తి ఉంది. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాలు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో వినియోగించే స్వీట్స్ ను పుల్లారెడ్డి దుకాణాల నుంచే తీసుకువ‌చ్చేలా.. ఎన్టీఆర్ హ‌యాంలో చేసిన చ‌ట్టం ఇప్ప‌టికీ అమ‌ల్లో ఉంది. అలాంటి స్వీట్స్‌పై అధికారులు కొర‌డా ఝ‌ళిపించారు.

అయితే.. తాజాగా పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్సును హైద‌రాబాద్ స‌హా తెలంగాణ వ్యాప్తంగా తాత్కాలికంగా ర‌ద్దు చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. పుల్లారెడ్డి స్వీట్స్ త‌యారు చేసే కార్ఖానాల్లో నెల‌కొన్న తీవ్ర‌మైన అప‌రిశుభ్ర‌తే కార‌ణ‌మ‌ని అధికారులు తెలిపారు. స్వీట్స్ త‌యారు చేస్తున్న కార్ఖానాల‌ను ప‌రిశీలించిన అధికారులు విస్తుబోయారు. భారీ ఎత్తున ఎలుక‌లు అక్క‌డే సంచ‌రించ‌డం.. వాటి మ‌ల మూత్రాలు కూడా కూడా అక్క‌డే ఉండ‌డాన్ని గుర్తించి.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదొక్క‌టే కాదు.. బొద్దింక‌లు కూడా కార్ఖానాను చుట్టుముట్టాయి.

నిజానికి జి. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే.. అదో మ‌హ‌త్త‌ర రుచి!. దీనికి తిరుగులేదు. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు.. పుల్లారెడ్డి స్వీట్స్ లేని పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు కూడా జ‌రిగేవి కావు. ఖ‌రీదు ఎంతైనా కూడా.. ఈ స్వీట్స్‌ను ఆహ్వానితుల‌కు వ‌డ్డించేవారు. ఏపీలోని క‌డ‌ప‌కు చెందిన పుల్లారెడ్డి.. అత్యంత శ్ర‌ద్ధ‌తో త‌న మిఠాయి దుకాణాన్ని డెవ‌ల‌ప్ చేశారు. త‌క్కువ బ్రాంచులే ఏర్పాటుచేసినా.. ఆయ‌న పేరుతోనే ఈ స్వీట్స్‌కు అనేక ప్రాంతాల్లో ప్రాముఖ్యం ఏర్ప‌డింది. ప్ర‌త్యేక‌మైన రుచిని కూర్చి చేశారా? అనేలా ఉండే ఈ స్వీట్స్‌కు పోటీగా ఎన్నో కంపెనీల స్వీట్స్ వ‌చ్చినా.. దీనికి సాటి లేదు.

పుల్లారెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆయ‌న కుమారులు బాధ్య‌త‌లు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి కొంత ఈ పేరుకు మ‌ర‌క‌లు ప‌డుతున్నాయ‌న్న వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ.. నెంబ‌ర్ 1 స్థానంలో ఈ స్వీట్స్ చోటు ద‌క్కించుకున్నాయి. తాజాగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన మెరుపు తనిఖీల్లో పుల్లారెడ్డి స్వీట్స్ ప్రధాన తయారీ కేంద్రంలో తీవ్ర‌ అపరిశుభ్రత వెలుగుచూసింది. దీంతో సదరు యూనిట్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

ఇవీ ప్ర‌ధాన లోపాలు..

  1. స్వీట్లు తయారు చేసే ప్రధాన వంటగది, వాషింగ్ ఏరియాలు అత్యంత మురికిగా ఉన్నాయి.
  2. బొద్దింక‌లు, ఈగలు, క్రిమికీటకాలతో నిండిపోయి ఉన్నాయి.
  3. పంచ‌దార స‌హా ఇత‌ర స‌రుకులు నిల్వ చేసే స్టోరేజ్ గదుల్లో ఎలుకల మలం, కుళ్ళిపోయిన పదార్థాలను గుర్తించారు.
  4. గ‌డువు తీరిన పదార్థాలు వాడుతున్నారు.
  5. వినియోగిస్తున్న నెయ్యి, నూనెలు కూడా నాసిర‌కంగా ఉన్నాయి.
  6. స్వీట్స్ త‌యారు చేస్తున్న సిబ్బంది డ్ర‌స్ కోడ్ కూడా పాటించ‌డం లేదు.