పవన్ మాట: నా అభిమానులు వైసీపీకి ఓటేశారు


‘‘పవన్ అన్న కోసం ప్రాణమిస్తాం. జగన్ అన్నకు ఓటేస్తాం’’.. సోషల్ మీడియాలో తెలుగు నెటిజన్ల చర్చల్లో తరచుగా కనిపించే స్లోగన్ ఇది. పవన్‌ను నటుడిగా ఎంతో అభిమానించే అతడి అభిమానుల్లో చాలా మంది అతడికి ఓట్లు వేయలేదని జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి స్పష్టంగా అర్థమైపోతుంటుంది. కారణాలు ఏమైనప్పటికీ.. పవన్ అభిమానులు ఎక్కువమంది గత ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తుంటారు.

ఈ మాట ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే అనడం గమనార్హం. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రాయలసీమలో తన అభిమానుల్ని ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నాడు.

రాయలసీమలో నిరుద్యోగంపై జనసేనాని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో వైకాపాకు చెందిన 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది.. ఉపాధి కల్పిస్తారనే నమ్మకంతోనని.. కానీ జగన్ సర్కారు ఆ ఆశల్ని నెరవేర్చలేకపోయిందని అన్నాడు. రాయలసీమ యువత బయటకు చెప్పుకోలేదని, వైసీపీ సర్కార్ నిర్వాకంతో నిస్సహాయ స్థితిలో ఉందని పవన్ వ్యాఖ్యానించాడు. రాయలసీమలో తన సభలకు లక్షలాది మంది జనం వచ్చినా.. తనపై అభిమానం ఉండి కూడా వైసీపీకి ఓటేశారని.. ఉపాధి కోసమే వైసీపీని గెలిపించారని పవన్ అన్నాడు.

ఇక జనసేన అగ్ర నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల తిరుమలకు రాలేకపోయానని, ఇకపై ప్రతి సంవత్సరం శ్రీవారి దర్శనానికి రావాలనుకుంటున్నానని పవన్ చెప్పారు. సంప్రదాయ దుస్తుల్లో పవన్ శ్రీవారిని దర్శించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆయన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. గురువారం తిరుపతిలో జనసేన ఎన్నికల కమిటీ.. ఇక్కడి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలపై చర్చించిన సంగతి తెలిసిందే.