కరోనా వైరస్ విరుగుడుగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తదితరులకు వ్యాక్సిన్ వేయటానికి ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి. వ్యాక్సినేషన్ మొదటిదశలో కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే టీకాలు వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 3 కోట్లమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ను గుర్తించింది. ఈ 3 కోట్లమందిలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, ఆశావర్కర్లు, మున్సిపల్ హెల్త్ వర్కర్లున్నారు.
ఈనెల 16వ తేదీన మొదలైన మొదటిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటివరకు 10 లక్షలమందికి టీకాలు వేశారు. మిగిలిన వారికి కూడా వేసేందుకు వేలాది కేంద్రాల్లో ఏర్పాట్లు ఇఫ్పటికే జరిగాయి. వీలైనంత తొందరగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారిచేసింది. ఎందుకంటే రెండో దశలో మామూలు జనాలందరికీ టీకాలు వేయాలని తన ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది.
ఈ రెండో దశలోనే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరు వస్తారని తాజా ఆదేశాల్లో వివరించింది. ఎలాగూ రెండోదశ టీకా వేయటంలో 50 ఏళ్ళు దాటినవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయమైంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల్లో అత్యధికులు ఎలాగూ 50 ఏళ్ళుటాదిన వాళ్ళే ఉంటారు.
టీకాలు రెండు డోసులు తీసుకున్న వారికి కరోనా వైరస్ ఇతరులనుండి సోకటం దాదాపు తగ్గిపోతుందని కేంద్రం అనుకుంటోంది. అయితే శాస్త్రీయంగా నిరూపణకాలేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ లో ఫైజర్ టీకాలు తీసుకున్న వాళ్ళకు కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్న అతికొద్ది దేశాల్లో ఇజ్రాయేల్ కూడా ఒకటి. ఈ దేశంలో ఫైజన్ ఫార్మా కంపెనీ రూపొందించిన కరోనా వైరస్ టీకాలను వాడుతున్నారు. అయితే రెండు డోసులు వేసుకున్న వాళ్ళల్లో సుమారు 12500 మందికి కరోనా సోకినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరి దీన్నిబట్టి టీకాల రక్షణపైనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరి మనదేశంలో ఏమవుతుందో చూడాల్సిందే.