పవన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

తొందలో జరగబోతున్న లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎట్టి పరిస్దితిలోను ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధే పోటీకి దిగాలని, బీజేపీ అందుకు సహకరించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. తిరుపతి లోక్ సభలో పోటీ విషయమై మద్దతిచ్చే షరతు మీదే గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు ఎన్నికల నుండి తప్పుకున్నారన్న విషయాన్ని జనసేన నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

ఇవే విషయాలను పవన్ తో చెప్పి ఎట్టి పరిస్దితుల్లోను బీజేపీ నేతల ఒత్తిడికి లొంగవద్దని గట్టిగా చెబుతున్నారు. జనసేన పార్లమెంటరీ ఎఫైర్స్ కమిటి (పీఏసీ) నేతలతో గురువారం, శుక్రవారం పవన్ భేటీ కానున్నారు. ఈ భేటి కూడా వ్యూహాత్మకంగా తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. సమావేశంలో రెండు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉంది. మొదటిదేమో పోటీలో జనసేన అభ్యర్ధే ఉండాలి. రెండోదేమో బీజేపీ సహకరించాలి.

ఒకవేళ జనసేన డిమాండ్ కు బీజేపీ గనుక సహకరించకపోతే ఏమి చేయాలనే విషయాన్ని కూడా నేతలు చర్చించనున్నారు. ఎందుకంటే ఈమధ్య పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగిందట. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి పోటీకి మద్దతుగా జనసేన నేతలు కలిసి రాకపోతే జనసేనను పక్కన పెట్టేయాలని అనుకున్నారట. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి జనసేన నేతలు కూడా బాగా మంట మీదున్నారు.

మొత్తానికి ఉపఎన్నిక వ్యవహారం పవన్ మీద బాగా ఒత్తిడి పెంచేస్తోందన్నది వాస్తవం. ఇపుడు గనుక జనసేన అభ్యర్ధిని పోటీలోకి దింపలేకపోతే భవిష్యత్తులో జనసేన కమలం పార్టీకి తోకపార్టీగా మిగిలి పోవటం ఖాయమని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు లొంగకూడదని కూడా కీలకనేతలు పవన్ను గట్టిగా కోరుతున్నారు. మరి రెండు రోజుల పీఏసీ సమావేశంలో ఏమని డిసైడ్ చేస్తారో చూడాల్సిందే.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)