దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అగ్రవర్ణాలలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నవారు కూడా కేవలం రిజర్వేషన్లు లేవన్న కారణంతో అవకాశాలు కోల్పోతున్న వైనంపై నెటిజన్లు, కొందరు విద్యావేత్తలు, మేధావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ గతంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అగ్రవర్ణాల్లోని పేదలకూ విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేయాలని గతంలోనే ఆదేశించింది. అయితే, ఈ రిజర్వేషన్లు మాత్రం తెలంగాణలో అమలు కాకపోవడంపై విమర్శలు వచ్చాయి.
దీంతో, తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు కూడా తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆల్రెడీ తెలంగాణలో బలహీన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్లకు ఈ 10 శాతం రిజర్వేషన్లు అదనమని చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కలుపుకొని తెలంగాణలో రిజర్వేషన్ల శాతం 60కు చేరుకుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి వాటికి సంబంధించిన విధివిధానాలు, నియమనిబంధనలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో, రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం తెచ్చిన 10% రిజర్వేషన్లను ఇకపై తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారని విద్యార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates