విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. రంగా జీవించి ఉన్న రోజుల్లో.. ఆయన తూర్పు నియోజక వర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత.. ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి కూడా పోటీ చేసి విజయం సాధించారు. ఇక, రంగా వారసుడిగా వచ్చిన రాధాకృష్ణ.. మాత్రం 2004 ఎన్నికల తర్వాత అది కూడా కాంగ్రెస్ హవా, వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రభావం ఎక్కువగా ఉన్న నాటి పరిస్థితిలో విజయం సాధించారు. ఇక, 2009 నాటికి పార్టీ మారి.. ప్రజారాజ్యంలోకి వచ్చారు. ఇక, అప్పటి నుంచి రాధాకృష్ణ అసెంబ్లీలోకి అడుగు పెట్టింది లేదు.
కట్ చేస్తే.. ప్రస్తుతం రాధాకృష్ణ జనసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. ఇది రెండు రకాలుగా రాధాకృష్ణకు కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి సామాజిక వర్గం కాపుల పరంగా.. జనసేనకు ఎలానూ గుర్తింపు ఉంది. ఇప్పుడు విజయవాడలో రంగా మిత్రమండలి నుంచి అదేవిధంగా కాపుల నుంచి కూడా రాధాకృష్ణకు మరోసారి గుర్తింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అన్నింటికీ మించి… వ్యక్తిగతంగా రాధా తీసుకునే నిర్ణయాలు కూడా అనేక విమర్శలకు దారితీశాయి. తాను చెప్పింది జరగాలన్న ధోరణి కారణంగా.. రాధా గతంలో కాంగ్రెస్, వైసీపీకి కూడా దూరమయ్యాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రాధా విజయవాడ నగర పాలక సంస్థ మహిళా కమిషనర్తో వివాదం పెట్టుకున్నారు. ఆమె కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేశారు. ఆ సమయంలో ఆమెను బదిలీ చేయాలని పట్టుబట్టారు. దీనికి వైఎస్ ససేమిరా అనడంతో మరుసటి రెండేళ్లకే ఆయన పార్టీ మారిపోయారు. ఇక, వైసీపీలోనూ ప్రస్తుత సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కావాలని పట్టుబట్టి.. చివరకు పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఇలాంటి పట్టుబెట్టులు.. రాజకీయాల్లో సరిపోవన్నది అందరికీ తెలిసిందే. సమయం, సందర్భం.. అవకాశం, అవసరం వంటివి మాత్రమే రాజకీయాల్లో పనిచేస్తాయి. ఈ విషయంలో రాధాలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాగా.. ఇప్పుడు విజయవాడలో సుప్తచేతనావస్థలో ఉన్న జనసేనకు రాధా కీకల నాయకుడిగా మారనున్నారనడంలో సందేహం లేదు.
గతంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యం సంపాయించుకున్న జనసేన నాయకుడు పోతిన మహేష్.. గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న దరిమిలా.. విజయవాడలో జనసేనకు నాయకులు కరువయ్యారన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో వంగవీటి పనితీరు, ఆయన వ్యవహరించే విధానం వంటివి ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయనకు, జనసేన కూడా కీలకంగా మారనున్నాయి. మరి ఏం చేస్తారు? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates