స్థానిక ఎన్నికలు అంటేనే అనేక చిత్ర విచిత్రాలు జరుగుతాయి. పంతాలు, పట్టింపులుంటాయి. అధికారం కోసం, గ్రామంలో పెత్తనం కోసం బంధాలను తెంచుకుంటారు. ఒకే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు ప్రత్యార్థులుగా మారి విమర్శలు చేసుకుంటారు. అలాంటిది ఓ యువ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమేఘాల మీద ప్రియురాలి మెడలో తాళి కట్టాడు. ఈ ఘటన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతుంది.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన టీడీపీ యువనేత, మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ చాన్నాళ్ళ నుంచి మున్సిపల్ చైర్మన్ పదవి మీద ఆశలు పెట్టుకున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వుంటూ ప్రజలతో మమేకమౌతున్నాడు. అయితే సాలూరు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఎలాగైనా సరే మున్సిపాలిటీలో పాగా వేయాలని పట్టుదలగా వున్న హర్ష వర్ధన్ వెంటనే ప్లాన్ బీ అమలు చేశాడు.
అవివాహితుడైన హర్ష వర్ధన్ కొన్నాళ్ళుగా మంజీర అనే యువతిని ప్రేమిస్తున్నాడు. నిన్నా మొన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ కుర్చీ మీద కూర్చొన్నాకే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తీరా చూస్తే నోటిదాకా వచ్చిన పదవి చూస్తుండగానే చేజారేలా కనిపించింది. సాలూరు సీటు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దాంతో ఇంట్లో వాళ్ళను మెప్పించి, ఒప్పించి మంజీర మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు. మిగిలిన కార్యాన్ని పక్కన పెట్టేసి తన భార్యకు సీటు కోసం అధినేత వద్దకు పరుగులు పెట్టాడు.
ఎవరికైనా సరే ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీ ఫాం కావాలి. ఈ పెళ్లితో హర్షవర్ధన్ చేతికి బీ ఫాం కంటే ముందే భార్య ఫాం వచ్చేసిందని అతడి స్నేహితులు, పార్టీ నాయకులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల పెళ్లితో మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసి గెలిచినంత పాపులారిటి సంపాదించాడు. బెస్ట్ ఆఫ్ లక్ హర్షవర్ధన్… మంజీర….
Gulte Telugu Telugu Political and Movie News Updates