బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ అగ్ర నాయకుల ప్రమేయం మీద ఆరోపణలు రావడంతో పాటుగా అంతిమ లబ్ధిదారుడిగా జగన్ పేరు ప్రచారంలో వున్న విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్ళ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గొడ్డలి పార్టీ అంటూ పేర్కొనడంతో దానికి ఆ పేరు స్థిరపడిపోయింది. చివరికి ఆ పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానీ కూడా అదే చెబుతున్నారు. బాబాయ్ గొడ్డలి.. బాబాయ్ గొడ్డలి అనేది జపమై పోయిందని అంగీకరించారు.

కృష్ణా జిల్లా స్థాయి వైసీపీ సమావేశంలో పేర్ని నాని చేసిన ప్రసంగం కాస్త ఆలస్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది. నానీ ఏమన్నారంటే… బాబాయ్ గొడ్డలి, బాబాయ్ గొడ్డలి…హూ కిల్డ్ బాబాయ్ అనేవి కూటమికి జపమైపోయిందని, బాబాయ్ స్వర్గంలో వున్నాడు… బాబాయ్ కూతురు చంద్రబాబు పక్కన వుంది… గొడ్డలి తెలుగు దేశం ఆఫీసులో దొరికిందని తనదైన స్టైల్లో చమత్కరించారు.

ఏంది ఇక్కడ ఉన్నావని గొడ్డలిని అడిగితే…మా గురువు చంద్రబాబును కలవడానికి వచ్చానని చెప్పిందని ఎద్దేవా చేశారు. నిజంగా జగన్ గారే వాళ్ళ బాబాయ్ ని చంపించి వుంటే.. మీకు దమ్ముంటే ఆ కేసులో జగన్ ను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. నేను తలచుకుంటే ఐదు నిముషాల్లో జైల్లో వేస్తానని చెబుతున్న చంద్రబాబు కు చేతనైతే జైల్లో వేయాలని చాలెంజ్ చేశారు. ఎవరైతే గొడ్డలి గొడ్డలి అంటున్నారో.. అసలు మీది మనిషి జన్మేనా అని ఎదురుదాడి మొదలుపెట్టారు.

అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ ఆరోపణలను కాసేపు పక్కన పెట్టినప్పటికీ ప్రజలేమనుకుంటున్నారో పేర్ని నానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తుంది. యావత్ రాష్ట్ర ప్రజలు వివేకా హత్య కేసులో వైసీపీ నాయకుల పాత్ర వుందని నమ్ముతున్నారన్నది మొన్నటి ఎన్నికల్లో తేలింది. బలంగా వున్న రాయలసీమలో కూడా వైసీపీ చిత్తు చిత్తుగా ఓడి పోయింది. రాయలసీమ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా వివేకా హత్య గురించి అనేక సందేహాలు వున్నాయి. అవన్నీ వైసీపీ పాత్ర గురించే ప్రశ్నిస్తున్నాయి.

ఇక వివేకా కూతురు సునీత, సొంత చెల్లెలు షర్మిల కూడా ఈ హత్య కు సంబందించి జగన్ కోటరీ మీద ఆరోపణలు చేయడం, ఫిర్యాదు చేయడం తెలిసిందే. నిందితులను జగన్ కాపు కాస్తున్నారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అంటే వివేకా హత్య కేసులో ఇంటా, బయటా వేళ్ళన్నీ వైసీపీ వైపే చూపుతున్నాయన్నది తెలిసిపోతుంది. అందుకే టీడీపీ గొడ్డలి పార్టీ జపం చేస్తోంది. జగన్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఆరోపణలకు జవాబు ఇవ్వలేక వైసీపీ నాయకులు యాతన పడుతున్నారు. కార్యకర్తలు సైతం ఇబ్బంది పడుతున్నారు.