స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల కంటే లోకల్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పడాలని, దీన్నే నాయకులు పనితీరుకు కొలమానంగా తీసుకుంటామని చెప్పారు. దీన్ని బట్టే మంత్రులు, పార్టీ నాయకులకు రేటింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. లోకల్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడ్డంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో పర్చువల్ గా మాట్లాడారు. పలు విషయాలు చర్చించారు.
స్థానిక ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పార్టీ బలం మరింతగా పెరగాలన్నారు. నిజాయితీగా పనిచేయకుండా డ్రామాలాడితే ఉపేక్షించేది లేదన్నారు. కూటమి పార్టీల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు. పై స్థాయిలో ఎలా ఉన్నామో, కింది స్థాయిలో కార్యకర్తలు అలాగే కలిసి మెలిసి పని చేయాలని చెప్పారు. విభేదాలకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని పనిచేయాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలను వైసీపీ అడ్డుకుందని చెప్పిన ఆయన ఇచ్చిన మాట ప్రకారం పార్టీ పరంగా 40 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. జయహో బీసీ, జనాభాలో సగం – కూటమి ఇచ్చింది బలం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ కుట్రలను బీసీలకు తెలియజేయాలని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో టీడీపీ నాయకులు, ఇంచార్జి మంత్రులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ల ఖరారు కూడా పూర్తి అవుతుందని సమాచారం. ఒంగోలు లాంటి సమస్యలున్న చోట ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఒంగోలు ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా సమస్యలు లేకుండా జనసేన, బీజేపీలు కలిసికట్టుగా పోటీ చేయడానికే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates