భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ కంపెనీకి అడ్డంకులు ఎదురవుతున్నాయని పరోక్షంగా ఆరోపించారు. అంబానీయే ఇండియాకు అసలు బాసా అంటూ ప్రశ్నించారు. అయితే మస్క్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత కొందరు నెటిజన్లు అమెరికాలో చైనా కంపెనీ BYD పరిస్థితిని గుర్తుచేస్తున్నారు. భారత్‌ను ప్రశ్నిస్తున్న మస్క్‌కు అమెరికాలో జరుగుతున్నది కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు.
చైనాకు చెందిన BYD ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటి. టెస్లాకు ప్రధాన పోటీదారుగా కూడా ఉంది. అయితే అమెరికాలో BYD ప్యాసింజర్ కార్ల అమ్మకాలకు భారీ అడ్డంకులు ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై అమెరికా 100 శాతం పన్ను విధించింది. దీంతో అక్కడ BYD కార్లను పోటీ ధరలకు అమ్మడం కష్టంగా మారింది.
పన్నులతో పాటు భద్రతా కారణాలను చూపిస్తూ చైనాకు సంబంధించిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఉన్న కార్లపై అమెరికా మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. కార్లలో ఉండే టెక్నాలజీ ద్వారా సమాచారం విదేశాలకు చేరే ప్రమాదం ఉందనేది అమెరికా ప్రభుత్వ వాదన. ఈ పరిస్థితుల్లో అమెరికా మార్కెట్‌లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ప్రారంభించే ఆలోచన ప్రస్తుతానికి లేదని BYD వైస్ ప్రెసిడెంట్ స్టెల్లా లీ కూడా చెప్పారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు. అమెరికా తన దేశ భద్రత కోసం చైనా కంపెనీపై ఆంక్షలు విధించవచ్చని భావించినప్పుడు, భారత్ మాత్రం విదేశీ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకూడదా అని అడుగుతున్నారు. స్టార్‌లింక్ ద్వారా అందించే ఇంటర్నెట్ సేవలు, వాటి సమాచారం, సరిహద్దు ప్రాంతాల్లో వినియోగం వంటి అంశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అయితే అమెరికాలో BYDపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వమే తప్ప మస్క్ వ్యక్తిగతంగా ఆ కంపెనీని నిషేధించలేదు. భారత్ లో కూడా డైరెక్ట్ గా అంబానీ అడ్డుకున్నట్లు ఆధారం లేదు. అయినా కూడా మస్క్ అంబానీ అన్నట్లు కామెంట్ చేశాడు. మరోవైపు భారత్ కూడా స్టార్‌లింక్‌ను పూర్తిగా నిషేధించలేదు. సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు, భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. స్టార్‌లింక్‌తో పాటు ఇతర శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీలకూ ఒకే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం ఇప్పటికే తెలిపింది. అమెరికాలో కూడా BYDకు ఎదురవుతున్న అడ్డంకులను గుర్తుచేస్తూ ఇప్పుడు మస్క్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates