గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించారు. సుమారు 20 నిమిషాల పాటు జ‌రిగిన ఈ బేటీలో కీల‌క‌మైన‌ న‌దుల అనుసంధానం గురించి ప్ర‌ధానితో చ‌ర్చించారు. గంగ నుంచి గోదావ‌రి వ‌ర‌కు, కావేరీ నుంచి కృష్ణాన‌ది వ‌ర‌కు అనుసంధానం చేయ‌డం ద్వారా.. ఉత్త‌రాది-ద‌క్షిణాది-ప‌శ్చిమ రాష్ట్రాల‌కు నీటి ల‌భ్య‌త పెరుగుతుంద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. దీనికిగాను కేంద్ర ప్ర‌బుత్వం.. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ న‌డుం బిగించాల‌ని ఆయ‌న కోరారు.

ఇక‌, ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల విష‌యాన్ని కూడా ప్ర‌ధాన మంత్రితో చ‌ర్చించారు. గోదావ‌రి పుష్క‌రాల‌కు ఆయ‌న‌ను ఆహ్వానించారు. ఇదేస‌మ‌యంలో పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నిధులు మంజూరు చేయాల‌ని.. దీనిని జాతీయ‌ ఉత్స‌వంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంద‌ని చెప్పారు. ఈ మేర‌కు నిధులు కేటాయించాల‌ని కోరారు. అలాగే.. రాష్ట్రంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు సాయం చేయాల‌ని అభ్య‌ర్థించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌ను ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ట్టు వివ‌రించారు.

ఇక‌, ప్ర‌జాపాల‌న విష‌యంలో 25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న ప్ర‌ధాని మోడీకి చంద్ర‌బాబు ధ‌న్య‌వాదాలు, శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రిన్ని సంవ‌త్స‌రాలు ఆరోగ్యంగా ఉండ‌డంతోపాటు, దేశాన్ని పాలించే శ‌క్తిని భ‌గ‌వంతుడు ప్ర‌సాదించాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌ధానికి.. అర‌కు కాఫీ, మంగ‌ళ‌గిరి చేనేత దుస్తులు, కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌ను కానుక లుగా అందించారు. దీనికి ముందు.. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను సైతం సీఎం చంద్ర‌బాబు క‌లిశారు. వారితోనూ రాష్ట్ర స‌మ‌స్య‌లు, నిధులు, కేంద్ర ప‌థ‌కాలకు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు.