తిరుపతి లోక్ సభ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ సొంతపార్టీ నేతలనే టెన్షన్ పెట్టేస్తున్నారు. బుధవారం తిరుపతిలో ప్రారంభమైన పార్లమెంటు కేంద్ర కార్యాలయం ప్రారంభానికి పనబాక గైర్హాజరయ్యారు. తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పనబాక లక్ష్మితో పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు తెగ ప్రయత్నిస్తున్నారు. తన సహజ మనస్తత్వానికి విరుద్ధంగా దాదాపు రెండు నెలల ముందే పనబాక అభ్యర్ధిత్వాన్ని అధినేత ప్రకటించేశారు. అభ్యర్ధిత్వాన్ని ప్రకటించినా ఆమె మాత్రం చాలాకాలం అసలు నోరే విప్పలేదు.
జనవరి 6వ తేదీన తన కూతురు వివాహం అయిపోగానే ప్రచారానికి దిగుతానని చెప్పారు. 6వ తేదీ అయిపోయినా ఇంతవరకు ప్రచారానికి దిగలేదు. పైగా నేతలకు కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. సరే 21వ తేదీనుండి నేతలు, శ్రేణులందరూ పదిరోజుల పాటు లోక్ సభ నియోజకవర్గం పరిదిలోని 700 గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలోనే తిరుపతిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.
తిరుపతిలోని ఆటోనగర్లో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని కీలక నేతలంతా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే అభ్యర్ధి పనబాక మాత్రం అడ్రస్ లేరు. రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారు కాబట్టి అభ్యర్ధి రాకపోతారా అని నేతలు అనుకున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు పనబాకకు సమాచారం కూడా ఇచ్చారట.
పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారని, అచ్చెన్న వస్తున్నారని తెలిసినా పనబాక అడ్రస్ లేకపోయేసరికి నేతలంతా ఆశ్చర్యపోయారు. పోటీ చేసే విషయంలో అసలు ఆమె మనసులో ఏముందో నేతలకు అర్ధంకాక అందరు అయోమయంలో పడిపోయారు. పోటీచేసే విషయంలో అధినేతతో పాటు నేతలను ఇంత అయోమయానికి గురిచేసిన అభ్యర్ధి మరోకరు లేరనే చెప్పాలి. అసలు పనబాక పోటీ చేస్తారో లేదో కూడా ఎవరికీ తెలీక ఎవరికోసం ప్రచారం చేయాలనే టెన్షన్ నేతల్లో పెరిగిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates