జిల్లాల వారీగా సమీక్షలకు తెరదీసిన వైసీపీ అధినేత జగన్.. ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో మాట్లాడి.. వారికి దిశానిర్దేశం చేసిన జగన్.. తాజాగా జిల్లాలపై దృష్టి పెట్టారు. ప్రతి జిల్లాకు చెందిన ఇంచార్జ్‌తోపాటు.. మాజీ జిల్లా మంత్రులను(ఇంచార్జ్) కూడా సమావేశాలకు పిలుస్తున్నారు. తద్వారా.. జిల్లాల్లో ఉన్న రాజకీయాలు తెలుసుకోవడంతోపాటు.. 3 కీలక అంశాలను వారికి చెబుతున్నారు. మొత్తంగా త్రిముఖ రాజకీయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ప్రజలను కలుసుకోవడం: ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం అంటే.. ఈ నెల నుంచే ప్రజలను కలుసుకునేందుకు నాయకులు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ చెబుతున్నారు. మండల, గ్రామీణ రాజకీయాలను ప్రభావితం చేయాలన్నది ఆయన భావన. ఈ విషయంలో నాయకులు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. అదేసమయంలో కొన్ని జిల్లాల్లో నిస్తేజంగా ఉన్న కాడర్‌ను బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టాలని సీనియర్లకు సూచించారు. కానీ, చిత్రం ఏంటంటే.. శ్రీకాకుళం, అనంతపురంలోని కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లే మైనస్ అవుతున్నారు.
గత-ప్రస్తుత ప్రభుత్వాల తేడాను వివరించడం: ఇక, జగన్ రెండో ప్లాన్.. గత తమ ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాలను ప్రజలకు వివరించడం. గతంలో తాము అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని.. కులం, మతం, పార్టీలను కూడా చూడకుండా అమలు చేశామని జగన్ చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం వివక్ష చూపిస్తున్నారన్నది ఆయన వాదన. ఈ తేడాను స్పష్టంగా నాయకులు ప్రజలకు వివరించాలని రెండో వ్యూహంగా చెబుతున్నారు.
ఎదురు దాడి: ఇక, అత్యంత కీలకమని జగన్ భావిస్తున్న మూడో వ్యూహం ఎదురుదాడి!. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకునాయకులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లాల వారీగా నాయకులు దూకుడు ప్రదర్శించాలని చెబుతున్నారు. అయితే.. కేసుల భయం నాయకులను వెంటాడుతున్న దరిమిలా.. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. ఇదిలావుంటే.. డిజిటల్ బుక్‌పైనా జగన్ చర్చించారు. ఇప్పటికి 2 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని రికార్డు చేస్తున్నామని.. చర్యలు తీసుకుంటామని (ప్రభు త్వం ఏర్పడ్డాక) హామీ ఇవ్వడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates