నరేంద్ర మోదీ… ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు… పాలకుడు. దేశంలో కొట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన నేత. హిందుత్వాభిమానులకు అవతారపురుషుడు. సరిగ్గా నేటికీ 25 ఏళ్ళ క్రితం బీజేపీలోనే ఆయన పెద్దగా ఎవరికీ తెలియదు. ఆర్ఎస్ఎస్ గురించి లోతైన అవగాహన వున్నవాళ్లకు తప్ప మిగతా వారితో పెద్దగా పరిచయాలు కూడా లేవు.
25 ఏళ్ళ తర్వాత మోదీ పేరు తెలియని వారు లేరు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా రాజకీయ, పరిపాలనా రంగాల్లో మోదీ అందరికీ సుపరిచితుడు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆర్ఎస్ఎస్ పునాదుల మీద నడిచివచ్చిన ఆయన సాధించిన విజయాలు అనేకం.
అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటివరకు ఓటమి ఎరుగని నేతగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గుజరాత్ కలహాల సమయంలో తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ వెనకంజ వేయకుండా ముందుకు సాగారు. 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి గుజరాత్‌పై తిరుగులేని పట్టు సాధించారు. అదే ఆయనను దేశానికి ప్రధాన మంత్రిని చేసింది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన మత కలహాలు ఆయనను చాలా కాలం వెంటాడాయి. ఒక సామాజికవర్గంతో పాటుగా దళితులు, లౌకిక వాదులు ఆయనకు పూర్తిగా వ్యతిరేకం అయ్యారు. అదేస్థాయిలో హిందుత్వ వాదులు ఆయనకు హారతి పట్టారు. హిందూ ధర్మ రక్షకుడిగా పట్టం కట్టారు. దాంతో జాతీయస్థాయిలో అప్పటివరకు ఆ ఇమేజ్ సాధించిన అద్వాని వంటి సీనియర్ నాయకులు వెనకపడిపోయారు. ప్రధాన మంత్రి రేసులో వున్న కళ్యాణ్ సింగ్ స్వయంకృతాపరాధాలతో తెరమరుగయ్యారు. దాంతో 2014 లో మోదీకీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వం అందివచ్చింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆయన అప్పటి నుంచి ఎప్పుడూ వెనక్కి చూడలేదు.
2014 ఎన్నికల్లో 282 సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన మోదీ 2019లో రెండో పర్యాయం 303 సీట్లతో ప్రధాని పదవిని చేపట్టారు. 2024 ఎన్నికల్లో సీట్లు తగ్గాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది. కేవలం 240 సీట్లు మాత్రమే సాధించింది. టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ పార్టీలతో పొత్తు పెట్టుకొని మూడోసారి కూడా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. వరసగా మూడు సార్లు ఎన్నికల్లో గెలిచి ప్రధాని పీఠం దక్కించుకొని జవహర్లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేశారు.
2005 లో మోదీ అమెరికా పర్యటన చేయకుండా వీసా తిరస్కరించింది. అదే అమెరికా నేడు మోదీ మాకు ఫ్రెండ్ అంటూ ట్రంప్ కూనిరాగాలు తీస్తున్నాడు. ఒకప్పుడు బీజేపీని అంటరాని పార్టీగా చూసినవాళ్లంతా ఇప్పుడు దగ్గరయ్యారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాలు బీజేపీ పాలనలోకి వచ్చాయి.
అయితే అంతా బాగుందా అంటే అదేం లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో మోదీ పాలనపై వ్యతిరేకత చాపకింద నీరులా ప్రబలుతోంది. 2024 ఎన్నికల్లో సీట్లు తగ్గడం నుంచి మొదలుకొని ఇప్పుడు కాక్రోచ్ పార్టీ దెబ్బకు కేంద్ర మంత్రి రాజీనామా చేయడం వరకు పరిస్థితి తలకిందులవుతున్నట్లు కనిపిస్తుంది.
మోదీ పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్ వివాదాస్పదం అయ్యాయి. పెద్ద నోట్ల రద్దు, పేపర్ లీకేజీల వివాదం, కోట్ల ఓట్లను తొలగించడం వంటివి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం విశ్వాసం కోల్పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ చోరీ ద్వారా బీజేపీ విపక్షాలను ఓడిస్తుందని ప్రచారం జరుగుతుంది.
పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం వంటి కారణాల వల్ల యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా సరే మోదీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్న నమ్మకం అత్యధిక శాతం ప్రజల్లో ఉండటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates