టీ బిస్కట్ ఇచ్చి వదిలిపెట్టం: లోకేష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత పెట్టుబ‌డి దారులు వ‌రుస‌గా రాష్ట్రానికి త‌ర‌లి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విశాఖ నుంచి అనంత‌పురం వ‌ర‌కు ప్ర‌భుత్వం ఆయాపెట్టుబ‌డి దారుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ.. వారిని ఆహ్వానిస్తోంది. అంతేకాదు.. ఉద్యోగాలు, ఉపాధి క‌ల్ప‌న‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా మంత్రి లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము పెట్టుబ‌డి దారుల‌తో కేవ‌లం టీ-బిస్క‌ట్ స‌మావేశాలు నిర్వ హించి.. పిలిచి.. వెళ్లిపోయేది లేద‌న్నారు. వారిని పెట్టుబ‌డులు పెట్టే వ‌ర‌కు చేయి ప‌ట్టుకుని న‌డిపిస్తున్నామ‌న్నారు.

విజ‌య‌వాడ‌లో శ‌నివారం ప్రారంభ‌మైన పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్- 2026లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ఏపీని అన్ని రంగాల్లోనూ నెంబ‌ర్ 1 చేసేందుకు సీఎం చంద్ర‌బాబు సార‌థ్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. రాష్ట్రానికి కొన్ని ల‌క్ష్యాలు ఉన్నాయ‌ని, అదేస‌మ‌యంలో కేంద్రానికి కూడా కొన్ని ల‌క్ష్యాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఇరు ప్ర‌భుత్వాలు ఉమ్మ‌డిగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్న‌ట్టు పేర్కొన్నారు. వాటి సాధ‌న‌కు కృషి చేస్తున్నామ‌న్నారు.

విక‌సిత్ భార‌త్ సాకారంలో ఏపీ పాత్ర కూడా కీల‌క‌మేన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో ఏపీలో పెట్టుబ‌డులు, అభివృద్ధి విష‌యంలో కేంద్రం కూడా స‌హ‌క‌రిస్తోంద‌న్నారు. వ‌చ్చే 10 సంవ‌త్స‌రాల్లో భార‌త్‌, ఏపీలు ఉమ్మ‌డిగా అభివృద్ధి సాధిస్తాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగానే పెట్టుబ‌డుల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. కేవ‌లం ఎంవోయూలు చేసుకుని చేతులు దులుపుకొనేది లేదన్నారు. ఆయా కంపెనీలు వ‌చ్చే వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టేవ‌ర‌కు కూడా తానే స్వ‌యంగా ఫాలో చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ప్ర‌తి విష‌యాన్నీ వారితో పంచుకుంటున్న‌ట్టు చెప్పారు.