రైతులపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

రైతుల‌పై బీజేపీ నేత‌లు నోరు పారేసుకుంటూనే ఉన్నారు. జైకిసాన్ అని ఓ వైపు రైతుల‌కు సంబంధించి గొప్ప‌గా చెప్పుకొంటూనే మ‌రోవైపు అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. రైతుల‌పై వివాదాస్ప‌ద‌వ్యాఖ్య‌లు చేస్తున్నా రు. ప్ర‌స్తుతం రైతుల సాగు చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన కేంద్రంపై రైతులు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రైతుల‌ను ఊర‌డించాల్సిన బీజేపీ నాయ‌కులు.. వారిని రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లుచేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఉద్య‌మం చేస్తున్న రైతుల‌ను ఉద్దేశించి ప‌లువురు బీజేపీ నేత‌లు నోరు పారేసుకున్నారు.

రైతులు తిన్న‌ది అర‌క్క ఉద్య‌మం చేస్తున్నార‌ని.. ఒక‌రిద్ద‌రు ప‌రుషంగా వ్యాఖ్యానిస్తే.. మ‌రికొంద‌రు.. రైతులు పొరుగు దేశాల‌తో చేతులు క‌లిపి ఇక్క‌డ శాంతినిభ‌గ్నం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. ఖలిస్తాన్ తీవ్ర‌వాదులు సైతం రైతుల ఉద్య‌మంలో ఉన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌, గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ పాటిల్‌, బీజేపీ నేత రామ్ మాధ‌వ్‌ల‌కు రైతులు నోటీసులు పంపారు. త‌క్ష‌ణమే బేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యం తీవ్ర వివాదం కావ‌డంతో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు రంగంలోకి దిగి స‌ర్ది చెప్పాల్సి వ‌చ్చింది. కేంద్ర మంత్రులు త‌ర్వాత రోజుల్లో నోరు అదుపులో పెట్టుకున్నారు.

ఈ ప‌రిణామాలు తెలిసి కూడా తాజాగా క‌ర్ణాట‌క వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ రైతుల‌పై నోరు పారేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే రైతులు మానసికంగా బలహీనులని, అలాంటి ఆత్మహత్యలను ప్రభుత్వం మెడకు చుట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వాలు కార‌ణం కాద‌ని ఆయ‌న తీర్పు చెప్పుకొచ్చారు.

అక్క‌డితో ఆగ‌కుండా.. రాష్ట్రంలో కేవలం రైతులే ఆత్మహత్యలు చేసుకోవట్లేదని, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఇతరులూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేవలం క్షణికావేశంలోనే ప్రాణాలు తీసుకుంటున్నారని, అన్నింటికీ ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాలా? అని ఎదురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల స‌మ‌యంలో రైతుల‌కు అది చేస్తాం.. ఇది చేస్తాం.. వారికి అన్ని విధాలా భ‌రోసా క‌ల్పిస్తామ‌ని చెప్పే నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.