అందరిచేత ‘అన్నగారు’ అనిపించుకున్న ఎన్టీయార్ కు భారతరత్న అనేది ఓ రాజకీయ నినాదంగా మిగిలిపోయింది. ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ వర్దంతి లేకపోతే జయంతికి మాత్రమే వినిపిస్తుంటుంది. నిజానికి భారతరత్న ఇవ్వటమన్నది ఒకరకంగా రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయమే. రాజకీయంగా పటిష్టంగా ఉన్నపుడు చంద్రబాబునాయుడు కానీ లేకపోతే అన్నగారి కూతురు పురందేశ్వరి కూడా అసలా విషయాన్నే పట్టించుకోలేదు.
ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతిన్నాడనే ప్రచారం జరిగిన రోజుల్లో ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను ఎందుకు చేయలేదు ? అనే ప్రశ్న ఎన్టీయార్ అభిమానుల నుండి వినబడుతోంది. అప్పట్లోనే చంద్రబాబు పట్టుబట్టుంటే ఎన్టీయార్ కు భారతరత్న ఎప్పుడో వచ్చేసేదని అనుకునే వాళ్ళున్నారు. ఇక దగ్గుబాటి పురందేశ్వరి విషయం తీసుకుంటే కాంగ్రెస్ లో పది సంవత్సరాల పాటు కేంద్రమంత్రిగా ఉన్నారు. అప్పట్లో యూపీఏ చీఫ్ సోనియాగాంధీ లేకపోతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమెకు మంచి ప్రాధాన్యతనే ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం నిర్ణయించినా అడ్డుకునేవాళ్ళే ఉండరు. అయినా మరి అప్పట్లో చంద్రబాబు కానీ లేకపోతే పురందేశ్వరి కానీ ఎందుకని ప్రయత్నించలేదని అభిమానులు గట్టిగానే అడుగుతున్నారు. అధికారంలో నుండి దిగిపోయిన వెంటనే ఎన్టీయార్ కు భారతరత్న అంటు చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ఇపుడు కూడా 2014-19 మధ్య ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఒక్కసారిగా కేంద్రాన్ని డిమాండ్ చేయలేదని టీడీపీ నేతలే గుర్తుచేస్తున్నారు.
ఇదే విషయమై ఎన్టీయార్ సతీమణి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీయార్ కు భారతరత్న ఎప్పటికీ రాదన్నారు. ఎందుకంటే ఎన్టీయార్ కు భారతరత్న ఇస్తే ఆ అవార్డును తానే తీసుకుంటానని అది చంద్రబాబుకు కానీ లేకపోతే ఎన్టీయార్ కుటుంబసభ్యులకు కానీ ఇష్టం లేదన్నారు. కాబట్టి ఎన్టీయార్ కు భారతరత్న అనే డిమాండ్ కేవలం రాజకీయ నినాదమే తప్ప మనస్పూర్తిగా చేయటం లేదని క్లారిటి ఇచ్చారు. చూడబోతే ఎన్టీయార్ కు భారతరత్న డిమాండ్ పై లక్ష్మీపార్వతి క్లారిటియే నిజమేమో.