దానం నాగేందర్.. దూకుడు మొత్తానికే ముసలం తెచ్చింది. ఆ.. ఏం చేసినా.. ఏం జరుగుతుందిలే.. అని లైట్ తీసుకుని వేసిన అడుగులు.. ఆయనకు అనర్హత వేటు వేసేలా చేశాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఉన్న ఎమ్మెల్యే పోస్టు ఊడిపోయి.. అనర్హత వేటు కూడా పడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 10 సెక్షన్ ప్రకారం.. అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధులు.. ఆరు సంవత్సరాల పాటు పోటీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇది.. పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది.
సో.. ఇదే జరిగితే.. దానం వచ్చే నాలుగు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి అనర్హుడు అవుతారు. దీంతో అటు ఎమ్మెల్యే పదవి పోయి.. ఇటు పోటీ చేసేందుకు కూడా అర్హత కోల్పోయిన నేపథ్యంలో రెంటికీ చెడ్డ రేవడి మాదిరిగా దానం పరిస్థితి మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. 2023లో బీఆర్ఎస్ తరఫున విజయం దక్కించుకున్న ఆయన తర్వాత కాలంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత.. పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. ఇదే అతి పెద్ద మైనస్‌గా మారిపోయింది. పోటీ చేసి పోనీ.. గెలిచారా? అంటే.. ఓడిపోయారు.
ఫలితంగా… ప్రస్తుత అనర్హత వేటుకు గత 2024లో పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసిన విషయమే పెద్ద అడ్డంకిగా మారింది. పైగా.. రాజ్యాంగంలో ఒక పార్టీపై గెలిచిన వారు వేరే పార్టీ తరఫున పోటీ చేయరాదన్న నియమం లేదన్న అర్థరహిత వాదన కూడా దానంను ఇరకాటంలో పడేసింది. అసలు పిటిషన్‌ను పూర్తిస్థాయిలో చదివేందుకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఆ ఒక్క వాక్యంతోనే మండి పడింది. అనంతరం.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. అనర్హత కొనసాగుతుందని తేల్చి చెప్పింది.
వాట్ నెక్ట్స్?
మరో ఆరు మాసాల్లోనే ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక రావడం తథ్యం. అయితే.. అనర్హత వేటు పడిన నేపథ్యంలో దానంకు పోటీ చేసే అవకాశం ఉండదు. దీంతో ఆయనకు బదులుగా.. కాంగ్రెస్ పార్టీ వేరేవారిని పోటీ చేయించడం కూడా తప్పదు. అయితే.. ఇప్పుడు పదవిని కోల్పోయిన నేపథ్యంలో దానం పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఆయనకు నామినేటెడ్ పదవి అయినా.. ఇవ్వాలి. లేకపోతే.. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అయినా.. ఇవ్వక తప్పదు. అప్పటి వరకు దానం ఎదురు చూడాల్సి ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates