ప్రకాశం జిల్లా గిద్దలూరులో బండ్ల వెంగయ్య నాయుడు అనే జనసేన కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. ఈ యువకుడు మూడు రోజుల కిందటే వార్తల్లో నిలిచాడు. తమ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వెంకట రాంబాబును గ్రామంలోని ఓ సమస్య మీద నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తమ ఊరిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని.. రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయని.. రోడ్డు వేయమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదని, ఇతర సమస్యలు కూడా పరిష్కారం కాలేదని వెంగయ్య నాయుడు.. కార్లో తమ ఊరి వైపు వచ్చిన ఎమ్మెల్యేను ఆపి అడిగాడు. ఐతే తనను ఏక వచనంతో సంబోధించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహించారు. ముందు మెడలో జనసేన కండువా తీసి మాట్లాడమన్నాడు. వెంగయ్య నాయుడిని ఎమ్మెల్యే దూషిస్తూ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
సమస్యల గురించి అడిగినందుకు వైకాపా ఎమ్మెల్యే దౌర్జన్యం జనసైనికులు దాన్ని వైరల్ చేశారు. ఐతే ఇది జరిగిన మూడో రోజు వెంగయ్య నాయుడు మృతి చెందాడు. అతను ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా చెబుతున్నారు. ఐతే వైకాపాకు చెందిన ఎమ్మెల్యే వర్గీయులే వెంగయ్య నాయుడిని చంపేశారని బాధితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేను సమస్యల మీద ధైర్యంగా నిలదీసిన వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని వారు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ అతను ఆత్మహత్యకు పాల్పడినా.. అది ఎమ్మెల్యే వర్గీయుల బెదిరింపుల వల్లే అని ఆరోపిస్తున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సమస్యల గురించి అడిగితే ప్రాణాలు పోవాల్సిందేనా అని ప్రశ్నించారు. వెంగయ్య నాయుడు మృతికి బాధ్యులైన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates