పిఠాపురం సేనలో ర‌క్తం చ‌ల్లారింది

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన‌పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయకుల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో లేన‌ప్పుడు చురుగ్గా ప‌నిచేశార‌ని.. వ్యాఖ్యానించిన ఆయ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం మెత్త‌బ‌డి పోయార‌ని అన్నారు. గ‌తంలో అధికారంలో లేన‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల్లో.. నాయ‌కుల్లో ఉడుకు ర‌క్తం ప్ర‌వ‌హించింది. నేనే చెప్పాలి.. నేనే చెయ్యాలి.. అని కాకుండా.. వారు సొంత కార్య‌క్ర‌మాలు చేశారు. ప్ర‌జ‌లకు చేరువ అయ్యారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ఎక్క‌డిక‌క్క‌డ చ‌ప్ప‌బ‌డి పోయారు. ఇది స‌రికాదు. దీనిని ఎలా స‌రిచేయాలో నాకు బాగా తెలుసు అని ప‌వ‌న్ అన్నారు.

పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. దీంతో ప‌ద‌వులు వ‌చ్చాయ‌న్న ఆనందంతో వారు త‌మ సొంత వ్య‌వహారాలు చేసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. దీంతో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేందుకు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్నారు. ఇది స‌రికాద‌ని తెలిపారు. కార్య‌క‌ర్త‌ల నుంచి నాయ‌కుల వ‌ర‌కు ఎవ‌రు ప‌నిచేస్తున్నారో.. ఎవ‌రు చేయ‌డం లేదో అన్ని వివ‌రాలు త‌న వ‌ద్ద ఉన్నాయని తెలిపారు. తాను పిఠాపురంలో ప‌ర్య‌టిస్తుంటే.. వంద‌ల మంది విజ్ఞాప‌న ప‌త్రాలు ఇస్తున్నార‌ని గుర్తు చేశారు. ఇలా ఎందుకు ఇవ్వాల్సి వ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు.

కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు చేరువ అయితే.. స‌మ‌స్య‌లు వారికే ప్ర‌జ‌లు చెప్పుకొనే వార‌ని.. కానీ, అలా చేయ‌డం లేద‌ని, ప‌ద‌వులు రావ‌డంతో వాటిని అనుభ‌విస్తున్నార‌ని.. అందుకే ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్పారు. తాజాగా మంగ‌ళ‌వారం అంత‌ర్గ‌తంగా ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అనేక విష‌యాల‌ను ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌స్తావించారు. రెండు మూడు మాసాల్లో తాను పిఠాపురంలో క్యాంపు ఆఫీసు పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. ఇక నుంచి నాయ‌కుల‌కు, కార్య‌కర్త‌ల‌కు కూడా అందుబాటులో ఉండి.. ఎవ‌రు ఏం చేస్తున్నారో.. నిశితంగా గ‌మ‌నిస్తాన‌న్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం అత్యంత ముఖ్య‌మని.. అదే పార్టీని బ‌లోపేతం చేస్తుంద‌ని వివ‌రించారు.

కూట‌మిముందు..

పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎలా ఉన్నా.. కూట‌మి బ‌లంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఈ దిశ‌గా పార్టీ నాయ‌కులు కృషి చేయాల‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్ల‌లో త్యాగాలు చేయ‌డం వ‌ల్లే.. పార్టీని ప్ర‌జ‌లు ఆద‌రించార‌ని గుర్తు చేశారు. త్యాగాల‌కు సిద్ధంగా ఉండాల‌నిగ‌తంలోనూ తాను సూచించాన‌న్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారిని గుర్తు పెట్టుకుంటామ‌ని.. ప‌ని చేయ‌ని వారితోనూ ప‌నిచేయించుకుంటామ‌ని చెప్పారు. పార్టీ అనేది కొన్ని సిద్ధాంతాల ఆధారంగా ప‌నిచేస్తుంద‌న్నారు. కేవ‌లం వ్య‌క్తుల‌ కోసం.. ప‌నిచేయ‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని.. పార్టీ ప‌రంగా బ‌లోపేతం కావాల‌నిపిలుపునిచ్చారు.