సినిమా అనేది అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. మంచైనా, చెడైనా జనాల్లోకి చాలా వేగంగా తీసుకువెళ్లే మీడియం ఇది. దీన్ని మంచి విషయాలను చెప్పడానికి ఉపయోగించుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు కూడా సందర్భోచితంగా సినిమాల్లోని విషయాలను, అందులో పని చేసే వ్యక్తులను ఉపయోగించుకుంటూ ఉంటాయి.
ఇటీవల కాలంలో తెలుగు సినిమాలో అతి పెద్ద సెన్సేషన్‌గా నిలిచిన ‘ఇరుముడి’ సినిమాలోంచి ఒక హిట్ పాటను తీసుకుని తెలంగాణ పోలీసులు ఒక మంచి పాటను తయారు చేశారు.
ఈ మధ్య డీజే సౌండ్స్ వల్ల గుండెపోట్లు వచ్చి జనాల ప్రాణాలు పోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వినాయకచవితి సంబరాల్లో ఇలాంటి విషాద ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు.. ‘ఇరుముడి’లోని హిట్ పాట ‘యాలాలో యాలాలో’కు పేరడీగా ఒక పాట రెడీ చేశారు. డీజేలు వద్దనే సందేశాన్ని ఈ పాటతో భలేగా అందించారు. ఆ పాట ఎలా సాగిందో ఒకసారి చూడండి.
‘‘యాలాలా యాలాలో డీజేల మనకొద్దురో..
యాలాలా యాలాలో మనుషుల ప్రాణాలు ముఖ్యమురో
సౌండుతో చెలగాటం.. చట్టంతో ఇరకాటం
చెప్పినా వినకపోవడం వద్దురా ఓ తమ్ముడా
నీ అమ్మ నీకోసం.. నీ నాన్న నీ రాకకోసం
వేయికళ్ళతో వేచి చూస్తారురా తమ్ముడా
యాల యాలో ఏముంది డీజేల్లో యాలో కొట్టండి
డప్పుల్లే కోలో వెయ్యిండిరా డ్యాన్సులే యాలో
గణపయ్యతో వెయ్యిండి తీన్మారు డోలో
డంకాను మోగించి పేద బతుకుల్లో వెలుగుల్ని నింపడిరా’’
ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనాల్లో అవగాహన పెంచడానికి ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates