ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఓ స్వామీజీ కూడా ఎన్నికల రంగంలోకి దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఇదే మండలంలో ఉన్న చందకచర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ స్వామీజీ పోటీకి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు రెండు కీలక హామీలు ఇచ్చారు. 1) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా తాను గ్రామంలో శాంతిభద్రతలు, అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా తరచుగా అల్లర్లకు, ఘర్షణలకు కారణమవుతున్న వారిని ఎలా ట్రీట్ చేయాలో తనకు తెలుసునని.. అలాగని గ్రామంలో ఎలాంటి నిర్బంధాలు విధించనని కూడా చెప్పారు.
2) గ్రామానికి.. తాను కోటి 50 లక్షల రూపాయలను ఇస్తానని సదరు స్వామీజీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన లెక్కలు చెప్పారు. ఈ సొమ్మును తాను ఎన్నికైన వెంటనే గ్రామ పంచాయతీ పేరిట ఉన్న బ్యాంకుఖాతాలో జమ చేస్తానన్నారు. వచ్చే వడ్డీతోపాటు.. ప్రభుత్వం ఏకగ్రీవం అయితే ఇచ్చే 50 లక్షల రూపాయలను కూడా గ్రామానికి ఉపయోగపడేలా చేస్తానన్నారు. ఇలా.. ఈ రెండు కీలక హామీలు ఇచ్చిన స్వామీజీ.. అనంతరం కీలక వ్యాఖ్యలు కూడాచేశారు. “నాకు సంసారం లేదు. కుటుంబ బంధాలులేవు. నాకు పిల్లలకు ఏదో చేయాలన్న ఆశలు కూడా లేవు. ఎందుకంటే నేను స్వామీజీ. ఎలాంటి బాదరబంధీ లేదు. ఇక్కడి గ్రామ ప్రజలే నాకు బంధువులు. వీరికి సేవ చేయడమే నా విధి.“ అని పేర్కొన్నారు.
అంతేకాదు.. అవినీతి, అక్రమాలు చేయాల్సిన అవసరం కూడా సాధారణ నాయకుడిగా తనకు అవసరం లేదన్నారు. స్వామిగా గ్రామం శాంతి కోసం.. ప్రజల రక్షణ కోసం అహరహం శ్రమిస్తానని చెప్పారు. ఇప్పుడు ఉంటున్న ఆశ్రమంలోనే ఉంటానని చెప్పారు. ప్రజాప్రతినిధి అయినప్పటికీ.. ఆ హోదాను ఎక్కడా వినియోగించుకోనన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏఅవసరం వచ్చినా.. తాను స్వయంగా వస్తానన్నారు. సిఫారసులు, లంచాలకు తావులేని సురక్షిత, శాంతి యుత పాలనను అందిస్తానని స్వామీజీ హామీ ఇచ్చారు. అయితే.. తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు స్వామీజీ శిష్యులు గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు.
ఎవరీ స్వామి..
మడకశిరలోని భూమానంద ఆశ్రమం వ్యవస్థాపకుడే ఈ స్వామి. ఈయన పేరు.. ధనుంజయ. పెనుగొండ రోడ్డులోని గౌడనహళ్లి ప్రాంతంలో ఈ ఆశ్రమం సుమారు 70 సంవత్సరాలుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇది ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో స్థానికంగా గుర్తింపు పొందింది. ఆశ్రమంలో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించేందుకు రెండు కేంద్రాలు ఉన్నాయి. ఆశ్రమం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానికంగా మహిళలకు చేతివృత్తుల్లో శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధనుంజయ స్వామికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉండడంగమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates