ఎన్నికలకు ముందు లైట్లు… ఓడిపోయాక తొలిగింపు

రాజస్థాన్ కావొచ్చు… ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు. స్థానిక ఎన్నికలంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. రాజస్థాన్ లో ఒక అభ్యర్థి అదేపని చేశాడు. ఎన్నికలకు ముందు వీధి లైట్లు వేయించాడు. అయినా ఓటమి పాలవడంతో వీధి దీపాలు తొలిగించాడు. దాంతో స్థానికులు తిరగబడ్డారు. చేసేదేమి లేక విద్యుత్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. ఇంతకూ ఏమి జరిగిందంటే…

ఇటీవల రాజస్థాన్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టోంక్ జిల్లా పీప్లూ పంచాయతీ రెండవ వార్డు మెంబర్ గా నివాయ్ ఎమ్మెల్యే రాం సహాయ్ వద్ద పనిచేసే పీఏ అలోక్ శర్మ రనోలి సతీమణి ప్రియాంక శర్మ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 751 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ప్రచారం సమయంలో అలోక్ శర్మ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లోని విధ్యుత్ స్తంభాలకు 50 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఓడి పోయిన తర్వాత అలోక్ శర్మ మనుషులు విధ్యుత్ శాఖ సిబ్బంది సహాయంతో వీధి దీపాలను తొలిగించే పనిలో పడ్డారు. 

పది దీపాలు తొలిగించిన తర్వాత స్థానిక ప్రజలు వాదనకు దిగారు. వీధి దీపాలు తొలిగించడానికి వీలులేదంటూ నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో మిగిలిన 40 వీధి దీపాలను వొదిలేసి విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ అధికారులు మాత్రం అవి అక్రమంగా ఏర్పాటు చేసిన లైట్లు కాబట్టే తొలిగించడానికి ప్రయత్నం చేశామని చెబుతున్నారు. తాము ఎవరి ఒత్తిడితోనో వీధి దీపాలు తొలిగించలేదని చెప్పారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడంతో మిగిలిన వీధి దీపాలు తొలిగించలేదని స్పష్టం చేశారు. 

ఈ వ్యవహారంతో  అధికార బీజేపీ అసలు రూపం బయట పడిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన బీజేపీకి ఏ కోశానా లేదని, వుంటే ప్రజలకు వీధి దీపాలు లేకుండా ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. బీజేపీ పాలనలో రాజస్థాన్ అంధకారంగా మారిందనడానికి ఇదొక్కటే నిదర్శనమని విమర్శించింది. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ అభ్యర్థి వీధి దీపాలు తొలిగించిన ఘటన రాజస్థాన్ లోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ప్రజలు, నెటిజన్లు బీజేపీ తీరు మీద మండిపడుతున్నారు.