మరో రెండు సంవత్సరాల్లో తెలంగాణా సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొందరికి సోయిలేదు. ఎవరి స్వార్ధం వారిదే. ఎవరి వాయిస్ వారిదే. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం కష్టమని ఒకరు స్టేట్మెంట్ ఇస్తారు. నేనే ముఖ్యమంత్రి అంటూ మరొకరంటారు. దాంతో పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికి కొందరు కాంగ్రెస్ నాయకుల పుణ్యమాని బీఆర్ఎస్ నాయకులు ఊపిరి పీల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికిమొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ మీడియా ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చింది. ఇది పార్టీకి నష్టం కలుగజేస్తుందని సీఎం చెబుతున్నారు.
గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీలో ప్రతి ఒకరి ప్రవర్తన, మాట తీరును పరిశీలిస్తున్నామని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని తప్పకుండా గుర్తించుకుంటాం, పార్టీకి ఇబ్బందులు కల్పిస్తున్న వారిని ఎప్పటికీ వొదిలి పెట్టం, వారినీ గుర్తించుకుంటామని తేల్చిచెప్పారు. ఇటీవల పార్టీలో లూజ్ టాక్ చేస్తున్న వారిని దృష్టిలో ఉంచుకొని సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు అంతర్గతంగా చర్చ జరుగుతుంది.
అంతేకాకుండా తెలంగాణాలో పార్టీ విజయం వెనక ఏం జరిగిందో రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించారు. నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తానని కేసీఆర్ బీరాలు పలికాడని గుర్తు చేశారు. అయితే డిజిటల్ మెంబర్షిప్ చేపట్టి 90 రోజుల్లో 48 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించి నోరు మూయించానని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల కృషి, పట్టుదలతో 92,35,833 ఓట్లతో 64 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. సీఎం ప్రసంగం ద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రస్తుతం నోరు పారేసుకుంటున్న నాయకుల ప్రమేయం లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయ్యిందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 92 లక్షల ఓట్లతో విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో కోటికి పైగా ఓట్లు సాధించి 90 స్థానాల్లో విజయపతాకం ఎగరేస్తామని స్పష్టం చేశారు. 15 ఎంపీ స్థానాల్లో గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తామని చెప్పారు. అంటే గత ఎన్నికల్లోనే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపులో మీ పాత్ర శూన్యమని అసంతృప్తివాదులకు తేల్చి చెప్పినట్టయ్యింది. మీ సంగతి తేల్చుకుంటామని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం వెనక మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అన్న సంకేతాలు ఇచ్చినట్టయ్యింది.
నిజానికి తెలంగాణా రాష్ట్రం ఇచ్చినప్పటికి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదు. నాటి టీఆర్ఎస్ కు పదేళ్లు అధికారం ఇచ్చారు. అప్పటికీ కాంగ్రెస్ నాయకులు శక్తియుక్తులను కూడతీసుకోలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ జవసత్వాలొచ్చాయి. చివరికి కేసీఆర్ ను ఫాంహౌస్ కు పంపించే వరకు రేవంత్ రెడ్డి విశ్రమించలేదు. రాష్ట్రం మొత్తం తిరిగి పార్టీని గెలిపించిన ఆయనను సొంత నియోజకవర్గం దాటితే పలకరించే వారు లేని నాయకులు విమర్శిస్తున్నారని కొందరు నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రసంగం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చకు దారితీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates