జ‌గ‌న్ ప‌ట్టు.. ష‌ర్మిల పంతం.. ముదిరిన ప్యాలెస్ వివాదం!

త‌న కుమార్తె అంజ‌లి పెళ్లిని బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌లో చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పంతం ఒక‌వైపు.. అలా చేయ‌డానికి వీల్లేదు.. అస‌లు ప్యాలెస్‌లోకి అడుగు కూడా పెట్ట‌డానికి వీల్లేదు అంటూ.. జ‌గ‌న్ ప‌ట్టుద‌ల మ‌రోవైపు.. వెర‌సి ఈ వివాదాన్ని కోర్టు వ‌ర‌కు తీసుకువెళ్లింది. మొత్తంగా కోర్టు కూడా.. ష‌ర్మిల‌కు `వెళ్లొద్దు` అనే ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారంలో ష‌ర్మిల సంయ‌మ‌నం పాటించాల‌ని న్యాయాధికారి తేల్చి చెప్పారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆదివారం సాయంత్రం నాటికి సీన్ మారిపోయింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా.. త‌న ప‌ని తాను చేస్తాన‌ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్పిన ష‌ర్మిల‌.. య‌ల‌హంక ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు బెంగ‌ళూరుకు చేరుకున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై జ‌గ‌న్ అనుచ‌రులు, సిలికాన్ బిల్డ‌ర్ సంస్థ య‌ల‌హంక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కూడా వారికి స‌మ‌ర్పించారు. దీంతో ఉన్న‌త‌స్థాయి అధికారులు పోలీసుల‌ను మోహ‌రించారు. ప్యాలెస్‌కు దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసుల‌ను మోహ‌రించారు.

ష‌ర్మిల వాద‌న ఇదీ..

కోర్టు ఉత్త‌ర్వుల విష‌యంలో ష‌ర్మిల మ‌రో వాద‌న వినిపిస్తున్నారు. ప్యాలెస్‌లో అలంక‌ర‌ణ‌లు చేసేందుకు.. ఇతర వ్య‌క్తుల‌ను ప్ర‌వేశించ‌కుండా చేసేందుకు మాత్ర‌మే కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని.. దీనిలో స్ప‌ష్ట‌త లేద‌ని ఆమె పేర్కొంటున్నట్టు కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌తంగా ష‌ర్మిల వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని.. ఇప్ప‌టికే త‌న‌కు వాటాగా ఉన్న ప్యాలెస్‌లో చేసిన ప‌నులు, ఏర్పాట్ల‌ను స‌మీక్షించుకునేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. దీనిలో త‌ప్పులేద‌ని అంటున్నారు.

అధికార పార్టీ ఎంట్రీ..

క‌ర్ణాట‌క అధికార పార్టీ కూడా..  కాంగ్రెస్ కావ‌డంతో ఈ వ్య‌వ‌హారంపై ఆ పార్టీ నేత‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని పార్టీ నాయ‌కులు కొంద‌రు చెబుతున్నారు. ఇది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మే అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలిగా ఆమెను కాపాడుకునేందుకు పార్టీ ఆదేశాలు జారీ చేస్తే.. ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని క‌ర్ణాట‌క న్యాయ‌శాఖ మంత్రి చెప్పారు. అయితే.. వ్య‌క్తిగ‌త విష‌యాల్లో ప్ర‌భుత్వ జోక్యం ఉండ‌ద‌ని.. కోర్టు ఎలా నిర్ణ‌యిస్తే.. ఆ నిర్ణ‌యాన్ని అమలు చేసేందు కు కోర్టు ప‌రిధిలోనే పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ ఎక్క‌డ‌?

ఇక‌, వైసీపీ అధినేత‌, ష‌ర్మిల సోద‌రుడు జ‌గ‌న్ ఎక్క‌డ‌? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌తి శ‌నివారం, ఆదివారం ఆయ‌న బెంగ‌ళూరుకు వెళ్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న ఎక్క‌డున్నార‌న్న‌ది తెలియాల్సి ఉంది. పార్టీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు తాడేప‌ల్లిలో జ‌గ‌న్ లేర‌ని అంటున్నారు. మ‌రోవైపు బెంగ‌ళూరు ప్యాలెస్‌కు కూడా జ‌గ‌న్ రాలేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్  ఎక్క‌డున్నారు?  అనేది ఆస‌క్తిగా మారింది. ఈ నెల చివ‌రిలో ఆయ‌న ఐరోపా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే.