వైసీపీ అధినేత జగన్.. ఆ పార్టీ నాయకులకు మంత్రి నారా లోకేష్ సవాల్ రువ్వారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రతి జిల్లాలోనూ పెట్టుబడుల వర్షం కురుస్తోందన్నారు. జిల్లా పరిస్థితి, వాతావరణం, అవకాశాలు, వనరులను ఆలంబనగా చేసుకుని ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఏయే జిల్లాల్లో ఏయే పరిశ్రమ వచ్చింది? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? అనే వివరాలతో కూడిన రాష్ట్ర మ్యాప్‌ను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
అంతేకాదు.. కూటమి హయాంలో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమ వచ్చింది? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? స్థానికంగా లభిస్తున్న ఉపాధి అవకాశాలు ఏంటి? అనే విషయాలను సమగ్రంగా వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ విషయంలో దాచుకునేది ఏమీ లేదన్నారు. బహిరంగ చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు.
ఇదేసమయంలో వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, పరిశ్రమలను తరిమేసిన తీరును కూడా చర్చిద్దామని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో తీవ్రంగా తాము శ్రమిస్తున్నామని.. ఇవే పరిశ్రమలను వెళ్లగొట్టడంలో గత వైసీపీ అరాచక శక్తులు కూడా తీవ్రంగా శ్రమించాయని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు ఎక్స్‌లో స్పందించిన నారా లోకేష్.. ఒకవైపు.. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల వివరాలతో కూడిన మ్యాప్‌ను, మరోవైపు.. వైసీపీ హయాంలో ఏం జరిగిందన్న మ్యాప్‌ను కూడా పోస్టు చేశారు. దీనికి చివరన.. “దమ్ముంటే చర్చకు రావాలి. లేదా.. ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు చూసి.. కడుపు మంటతో రగిలిపోతున్నవారు.. `బర్నాల్` రాసుకోవాలి“ అని అర్థం వచ్చేలా రెండో మ్యాప్‌లో బర్నాల్ ఆయింట్‌మెంటును పోస్టు చేశారు.
ఇక, ఇటీవల సీఐఐ సదస్సులో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై వైసీపీ నాయకులు పెదవి విరిచారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. కోటి రూపాయల పెట్టుబడులు కూడా రాలేదంటూ.. వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా లోకేష్ ఈ పోస్టు చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates