పవన్ అన్నకు నేను.. నాకు పవన్ అన్న

వైసీపీ అరాచక పాలనకు తెరదించేందుకు 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ లు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మరో 15 ఏళ్ల పాటు కూటమిగానే ఎన్నికల బరిలో దిగుతామని పవన్ పదే పదే స్పష్టం చేశారు కూడా. అయితే, లీడర్ల మధ్య ఉన్న ఈ క్లారిటీ…క్యాడర్ లో అదే స్థాయిలో లేదనిపిస్తోంది. అందుకే, సోషల్ మీడియాలో కొందరు కూటమి సఖ్యతపై రకరకాల పుకార్లు పుట్టిస్తుంటారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీల సఖ్యతపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

2029 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని లోకేశ్ స్పష్టం చేశారు. నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు అంటూ కూటమి కలిసే ఉంటుందని తేల్చి చెప్పారు. నాయకత్వంలో ఎలాంటి ఇష్యూ లేదని, డౌట్ లేదని…ఒక వేళ డౌట్ ఉంటే..పవన్ అన్నకు ఫోన్ చేసి ఇలా ఉందన్నా..ఏం చేద్దాం అని అడుగుతానని…ఒకవేళ పవన్ అన్నకు ఏమన్నా ఉంటే తనకు ఫోన్ చేసి…అరె లోకేశ్ ఇట్లా ఉందిరా…ఏం చేద్దాం అని అడుగుతాడని లోకేశ్ చెప్పారు.

గతంలో కోయంబత్తూర్ లో జరిగిన ఇండియా కాంక్లేవ్ సందర్భంగా తాను 2029లో కూటమి కలిసి పోటీ చేస్తుందని చెప్పానని అన్నారు. ఆ తర్వాత పవన్ అన్న తనకు ఫోన్ చేసి 2029 తర్వాత కనీసం మరో రెండు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని చెప్పకుండా ఒక ఎన్నిక అని ఎందుకు చెప్పావ్ అని అడిగారని, మొత్తం కనీసం మూడు సార్లు కలిసి పోటీ చేసి గాడి తప్పిన రాష్ట్రాన్ని, పాలనను గాడిలో పెట్టాలని కోరారని చెప్పారు. పైన తమ మధ్య ఆ రేంజ్ లో అండర్ స్టాండింగ్, క్లారిటీ ఉందని…కింద క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య కూడా ఈ తరహా క్లారిటీ ఉండాలని లోకేశ్ ఆకాంక్షించారు. టీడీపీది కోటి ఆరు లక్షల మంది కుటుంబం అని, జనసేన, బీజేపీ కలిశాక మరింత పెద్ద కుంటుంబం అయిందని లోకేశ్ అన్నారు.