సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. హీరోయిన్ మందాకిని జీవితం దీనికి ఒక నిదర్శనం. రామ్ తేరి గంగా మైలి సినిమాతో ఒక వెలుగు వెలిగిన మందాకిని రాత్రికి రాత్రి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ ఒక్క సినిమాతో దేశం మొత్తం పేరొచ్చింది. తెలుగులో సైతం హీరో కృష్ణ పక్కన సింహాసనంలో హీరోయిన్ గా వెలిగింది. ఆకాశంలో ఒక తార… నాకోసం వచ్చింది ఈ వేళ అనే పాట తెలుగునాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పలేం. అలాంటిది ఒకే ఒక్క ఫోటో ఆమె కేరిర్ ను తీవ్రంగా దెబ్బ తీసింది. ఆకాశం నుంచి ఎత్తి కిందకు పడేసింది.
1994లో షార్జాలో జరిగిన క్రికెట్ చూసేందుకు మందాకిని దుబాయ్ వెళ్ళింది. ఆ సమయంలో ఆమె పక్కన అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం వున్నాడు. అప్పటికే ముంబై పేలుళ్ల కేసులో దావుద్ ప్రధాన నిందితుడిగా వున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా వున్న దావుద్ పక్కన మందాకిని కూర్చున్న ఫోటోలు మీడియా చేతిలో పడ్డాయి. ఇంకేముంది దేశం మొత్తం అట్టుడికి పోయింది. దావుద్ తో మందాకిని రిలేషన్లో వుందని పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. అప్పటికే ఆమె ముంబై వదిలిపెట్టి దుబాయ్ లో నివసిస్తుంది. దాంతో దావుద్ కోసమే ఆమె ముంబై వదిలి వెళ్లిందని మీడియా కోడై కూసింది.
ఈ ఆరోపణలను మందాకిని ఖండిస్తూ వచ్చింది. దావుద్ తో కేవలం పరిచయం మాత్రమే వుందని, ఎలాంటి వ్యక్తిగత, శారీరక సంబంధం లేదని ఖండించింది. తాను ఒక స్టేజ్ షో కోసం దుబాయ్ వెళ్ళానని, అప్పుడు షార్జా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. దావుద్ తో యాధృచ్చికంగా కలిసినట్లు వివరించారు. అయినప్పటికీ జనం నమ్మలేదు. హిందీ పరిశ్రమ ఆమెను దూరంగా పెట్టింది. దాంతో సినిమా అవకాశాలు చేజారి పోయాయి.
ఈ విషయం గురించి ఇటీవల ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా మందాకిని మాట్లాడుతూ ఆ ఒక్క ఫోటో నా కేరిర్ ను దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకూ దావూద్‌కు మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, ఇతర సంబంధాలు ఉన్నాయని వచ్చిన వార్తలను నేను అప్పట్లోనే ఖండించాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఇలాంటి వివాదాలను ఎదుర్కోవడానికి ఒక ప్రొఫెషనల్ పీఆర్ టీమ్ ఉండి ఉంటే బాగుండేదనిపిస్తోందని అభిప్రాయపడింది .
ఆ తర్వాత కాలంలో మందాకినికి దావుద్ ఇబ్రహీంతో సంబంధం వున్నట్లు అధికారికంగా నిరూపణ కాలేదు. కానీ గతం తిరిగి రాదు కదా. కేరిర్ పీక్ లో వున్నప్పుడు ఆమె మీద ఆరోపణలు రావడంతో రాత్రికి రాత్రే ఆమె స్టార్ డమ్ తల కిందులయ్యింది. పిల్లి కళ్ళతో యువకుల హృదయాలను దోచుకున్న మందాకిని చేయని నేరానికి బలయ్యింది. ప్రస్తుతం ఒక బౌద్ధ సన్యాసినిని వివాహం చేసుకొని ప్రశాంతంగా జీవిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates