ఒక్క‌డై వ‌చ్చి.. ఒంట‌రిగా.. ఆళ్ల నాని ఫ్యామిలీ పాలిటిక్స్ ఎండ్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే.. ఏమాత్రంరాజ‌కీయ వాస‌న‌లు లేని కుటుంబం నుంచి ఒక్కడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయ‌న‌.. ఏలూరు కేంద్రంగా సుదీర్ఘ కాలం పాటు క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గుండెపోటు కారణంగా 15 సెప్టెంబర్ 2026న ఆయన హఠాన్మరణం చెందారు.

ఆళ్ల నాని రాజకీయ అరంగేట్రం.. చిత్ర‌మ‌నే చెప్పాలి. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆళ్ల నాని.. కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏలూరు నుండి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, పట్టువదలకుండా పోరాడారు. 2004లో తొలిసారి విజయం ద‌క్కించుకున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత విధేయుడిగా, అభిమానిగా వ్య‌వ‌హ‌రించిన నాని.. వైఎస్ ఆశీర్వాదంతోనే 2004 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున వరుసగా రెండోసారి గెలుపు గుర్రం ఎక్కారు. వైఎస్ మ‌రణానంతర పరిణామాలతో 2013లో కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. క్లిష్ట పరిస్థితుల్లో జగన్(జైల్లో ఉన్న‌ప్పుడు) వెంట నడిచిన నేతల్లో ఆళ్ల ఒకరు. 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పార్టీపై ఆయనకున్న నిబద్ధతను గుర్తించిన జగన్.. 2017లో ఆయనను ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నుండి మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. జగన్ క్యాబినెట్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, అలాగే అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఆ సంక్షోభ సమయంలో ఏపీ ఆరోగ్య రంగాన్ని సమర్థవంతంగా నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2022 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకు ఆయన మంత్రిగా కొనసాగారు.

ముగిసిన ప్ర‌స్థానం..
ఆళ్ల ఫ్యామిలీ నుంచి రాజ‌కీయాల్లో వ‌చ్చిన నానితోనే ఈ కుటుంబ రాజ‌కీయాలు ముగిసిపోతున్నాయి. త‌దుప‌రి వార‌సులు ఎవ‌రూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌త్యేక ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు. స‌తీమ‌ణి సైతం.. రాజ‌కీయాల‌కు క‌డు దూరంగా ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండ‌గా.. మ‌రో కుమారుడు విదేశాల్లో ఎంబీఏ చ‌దువుతున్నారు. వారికి రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక ఇంట్ర‌స్ట్ లేదు. దీంతో నాని రాజ‌కీయాలు ముఖ్యంగా ఆళ్ల కుటుంబ రాజ‌కీయాలు ఇక్క‌డితో ముగిసిపోయిన‌ట్టేన‌ని ఏలూరు ప్ర‌జ‌లు చెబుతున్నారు.