ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫలితం విషయంలో గతంలో ఏ చిత్రానికీ లేనంతగా నాని టెన్షన్ పడుతుంటాడనడంలో సందేహం లేదు. అందుకు కారణాలు లేకపోలేదు. మామూలుగా నాని సినిమాలకు బడ్జెట్లు అదుపులోనే ఉంటాయి. కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్ ఉన్న నానికి సక్సెస్ రేట్ ఎక్కువే. తక్కువ వర్కింగ్ డేస్‌తో, మంచి క్వాలిటీతో సినిమాలు పూర్తి చేస్తుంటాడు.

తన సినిమాలకు మంచి బిజినెస్ జరిగి చాలా వరకు టేబుల్ ప్రాఫిట్‌తో నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. సినిమాకు హిట్ టాక్ వస్తే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా.. నిర్మాతలు, బయ్యర్లు సేఫ్ జోన్లోనే ఉంటారు. నాని ఇంత కాలం అంత క్యాల్కులేటెడ్‌గా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ విషయంలో నాని లెక్కలు తారుమారు అయ్యాయి.

ఈ సినిమాకు వర్కింగ్ డేస్ చాలా ఎక్కువ అయ్యాయి. ఏకంగా ఏడాదిన్నర పాటు మేకింగ్ దశలోనే ఉందీ చిత్రం. బడ్జెట్ బాగా పెరిగిపోయి చేతులు దాటిపోయిన పరిస్థితి తలెత్తింది. నాని కెరీర్లో సినిమా మధ్యలో ఉండగా బడ్జెట్ విషయంలో నిర్మాత భయపడడం, ఫైనాన్స్ కోసం నిర్మాత వెతుక్కోవడం, ఎక్కువ రీషూట్లు చేయడం ఈ సినిమాకే జరిగింది. ఐతే అన్ని అడ్డంకులనూ దాటి సినిమాను పూర్తి చేశారు. రిలీజ్‌కు రెడీ చేశారు. అంతర్గతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఈ సినిమాకు ఇటు ట్రేడ్‌లో, అటు ప్రేక్షకుల్లో హైప్ మాత్రం తగ్గకపోవడం ప్లస్ పాయింట్. కాబట్టే బిజినెస్ భారీగానే జరిగింది. అదిరిపోయే ఓపెనింగ్స్ ఇవ్వడానికి ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు.

కానీ ఈ సినిమా నాట్ బ్యాడ్.. పర్వాలేదు.. యావరేజ్ లాంటి టాక్ తెచ్చుకుంటే కష్టం. కచ్చితంగా బ్లాక్‌బస్టర్ టాక్ రావాల్సిందే. ప్రి రిలీజ్ హైప్ ప్రిమియర్లు, డే-1 బుకింగ్స్, కలెక్షన్ల వరకు ఢోకా లేకుండా చేస్తుంది. కానీ తర్వాత సినిమా టార్గెట్లను అందుకోవాలంటే మాత్రం అదిరిపోయే టాక్ రావాలి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. రూ.105 కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే వీకెండ్ అంతా హౌస్ ఫుల్స్‌తో రన్ అవడంతో పాటు లాంగ్ రన్ ఉంటేనే ఆ టార్గెట్‌ను అందుకోగలదు. కాబట్టి సినిమాకు మామూలు టాక్ సరిపోదు.