ఎఫ్ బీఐని ఏపీ పోలీసులు దుర్వినియోగం చేశారు: జగన్

అమెరికా ఎఫ్‌బీఐ పేరుతో సోషల్ మీడియా పోస్టుల తొలగింపునకు ఎక్స్ కు అభ్యర్థనలు పంపారని ఏపీ పోలీసులపై, ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు.

రెడ్ బుక్ పాలన అంతర్జాతీయ స్థాయికి చేరిందని, నకిలీ గుర్తింపుతో ఏపీ పోలీసులు ఎఫ్ బీఐ పేరును వాడుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని జగన్ అన్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ లో పెట్టే పోస్టులు తొలగించాలని కోరుతూ గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ అధికారిక ఈ మెయిల్ అడ్రస్ నుంచే మెయిల్ వెళ్లిందని ఆరోపించారు.

అయితే, ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏవీ బ్రహ్మం పేరుతో ఆ మెయిల్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన తన ఆర్గనైజేషన్ పేరుగా ‘ఎఫ్ బీఐ’ అని వాడారని జగన్ వెల్లడించారు. ఇలా, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధించేందుకు ఎఫ్ బీఐ పేరు వాడుకోవడం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయడమేనని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కడానికి విదేశీ దర్యాప్తు సంస్థల పేర్లను దుర్వినియోగం చేయడం ఏపీ పోలీసుల విశ్వసనీయతను దిగజార్చిందని అన్నారు.

అయితే, జగన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆ వ్యవహారానికి సంబంధించి చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు ఎస్పీ అధికారిక మెయిల్ ఐడీ sp@gtr.appolice.gov.in అని, కానీ, జగన్ చేసిన పోస్ట్ లో మెయిల్ ఐడీ guntururban-sp@gov.in అని ఉందని గుర్తు చేస్తున్నాయి. కాబట్టి, జగన్ చెబుతున్న మెయిల్ ఐడీ అఫీషియల్ కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే, జగన్ చేసిన పోస్ట్ లో gov.in అనే డొమైన్ ఉందని, ఆ డొమైన్ ఎవరికి పడితే వారికి ఇవ్వరని, అది గుంటూరు ఎస్పీ పాత మెయిల్ ఐడీ అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.