తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. తన తల్లిని బ్రతికించుకోవడానికి వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన కొడుకు 48 రోజులపాటు బిచ్చగాడిగా మారిన కథ అన్ని వర్గాల ప్రేక్షకులను కదిలించింది. కోటీశ్వరుడైన విజయ్ ఆంటోని తన గుర్తింపును ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి కేవలం భిక్షాటన ద్వారా వచ్చిన ఆహారాన్ని మాత్రమే తిన్న వైనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఇటువంటి సీన్లు కేవలం రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా ఉన్నాయి. వేల కోట్ల ఆస్తులున్న బీజేపీ ఎమ్మెల్యే ఒకరు బిచ్చగాడిగా మారిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఒక రోజుపాటు బిచ్చగాడిగా మారారు. రూ. 3,383 కోట్లకు పైగా ఆస్తులున్న పరాగ్ షా చిరిగిన దుస్తులతో రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేసిన వైనం చర్చనీయాంశమైంది. అధికారం, విలాసాలకు దూరంగా బిచ్చగాడిలా ఒక్కరోజైనా గడపాలని జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ ఉపదేశం ప్రకారం ఆయన ఇలా చేశారు. 2024 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువను రూ. 3,383 కోట్లుగా ప్రకటించిన పరాగ్ షా ఇలా ఒక్కరోజు భిక్షాటన చేయడం వార్తల్లో నిలిచింది.
దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరైన ఆయన అన్నీ వదిలేసి ఇలా యాచకుడిగా మారడం హాట్ టాపిక్ అయింది. ఒక రోజంతా భిక్షాటన తర్వాత సాధారణ దుస్తులు ధరించి స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదిగిన పరాగ్ షా భద్రతా సిబ్బంది, ఖరీదైన వాహనాలు, హోదా వదిలి ఒక రోజు పాటు వైరాగ్య జీవితం గడిపిన వైనంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates