మోదీ పుట్టినరోజు.. దీపం వెలిగించండి!

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అప్రతిహాత విజయాలతో దూసుకొని వెళుతున్న నేపథ్యంలో ఈ సారి ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ ఏడాది 17 వ తేదీ నాటికి మోదీ 76ఏళ్ళు పూర్తి చేసుకోనున్నారు. అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాన మంత్రి వరకు 25 ఏళ్ళ ప్రజా జీవితం పూర్తి చేసుకోనున్నారు. దాంతో ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వ తేదీ వరకు రకరకాల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ధిదారులను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు దేశవ్యాప్తంగా ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని కోరుకుంటూ ఇంటింటా దీపాలను వెలిగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు . కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులంతా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని కోరారు . అదే సందర్బంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సేవ-అంకితభావం-25 సంవత్సరాలు , వికసిత భారతదేశం అనే అంశాలపై సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిత్రలేఖనం, వ్వక్తృత్వ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. మోదీ పాలనలో నిరుపేద ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరిస్తూ లబ్ధిదారుల అభిప్రాయాలతో రీల్స్, వీడియోలను రూపొందించి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. మోదీ విజయాలు యువతకు చేరే విధంగా హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రచారం చేయనున్నారు.

సేవా జ్యోతి కలశ యాత్ర – వికసిత భారతదేశ సంకల్పం పేరుతో దేశ వ్యాప్తంగా అన్నీ గ్రామాలు, మండల కేంద్రాలలో యాత్రలు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన పిఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, లఖ్‌పతి దీదీ వంటి పథకాల లబ్ధిదారుల ఇళ్లకు బీజేపీ శ్రేణులు స్వయంగా వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద నెల రోజుల పండుగకు రంగం సిద్ధం అవుతుంది. గతంలో ఏ ప్రధానికి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.