వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు అంతగా గుర్తుండదు. ఒక్క షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని విశాల్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ రికార్డు నమోదు చేయడం సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది. దానికన్నా ఎక్కువగా ఫలితం తెలిశాక కూడా మకుటం మేకింగ్ వీడియోలను విశాల్ పదే పదే పంచుకోవడం అనవసరంగా నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఓటిటి వంతు వచ్చింది.

ఇటీవలే మకుటం అన్ని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సదరు ఓటిటిలో ఈ మధ్య చెప్పుకోదగ్గ కంటెంట్ లేకపోవడంతో జనాలు దీన్నే చూశారు. వాళ్ళు ఏమనుకున్నారనేది యూట్యూబ్ లాగా కామెంట్స్ లో కనిపించదు కాబట్టి కేవలం వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. దాని ప్రకారం మకుటం రెండో రోజే వన్ రాంక్ తెచ్చుకుంది. దీంతో విశాల్ ఆడియన్స్ కి స్పెషల్ థాంక్స్ చెబుతూ వీడియో చేస్తే అవతల ఓటిటి సంస్థ మేకింగ్ వీడియోలను తగిలించి మరీ ప్రచారం చేస్తోంది.

ఇంతగా ఈ కళాఖండాన్ని విశాల్ ప్రమోట్ చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఇది తన డైరెక్షన్ డెబ్యూ. స్వయంగా దర్శకత్వం వహించాడు. ముందు వేరే దర్శకుడికి బాధ్యత అప్పజెప్పి అతనితో విభేదాలు వచ్చాక మెగా ఫోన్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. నిర్మాత ఆర్బి చౌదరి ఓకే చేసిన ప్రాజెక్టు ఇది. కానీ షూటింగ్ మధ్యలో ఆయన ప్రమాదశావత్తు రోడ్డు ప్రమాదంలో కన్ను మూయడంతో రిలీజ్ కొంత ఆలస్యమయ్యింది. రిజల్ట్ చూస్తేనేమో ఇలా వచ్చింది.

వీలైనంత త్వరగా విశాల్ వాస్తవంలోకి రావాలి. కుర్ర హీరోలు, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు దూసుకుపోతున్నారు. విశాల్ స్టార్ గా ఉన్నప్పుడు కమెడియన్ గా నెట్టుకుంటూ వచ్చిన సూరి ఇప్పుడు మండాడి పుణ్యమాని పాతిక కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. నిన్న మొన్న వచ్చిన యూత్ హీరోలు కెరీర్ ప్లానింగ్ లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కానీ విశాల్ మాత్రం మకుటం లాంటి అవుట్ డేటెడ్ సినిమాలతో జనాల సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు.