అస‌లు సిస‌లు హైద‌రాబాదీ రోశ‌య్యే!

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై ఆవేశ ప‌డుతున్నారంటూ.. కొన్ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌ర‌చుగా ఆయ‌న పాల్గొంటున్న బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడుతున్న తీరు చూస్తే.. ఇదే వ్యాఖ్య‌లు వినిపించ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని అనుకోవ‌చ్చు. బ‌హుశ ఈ విష‌యాన్ని గ్ర‌హించారో ఏమో.. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఆవేశం లేద‌ని.. ఆలోచ‌నే ఉంద‌ని చెప్పుకొచ్చారు.

మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధ నేత రోశ‌య్య వర్థంతి కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రోశయ్య లాంటి సమర్థుడైన సహచరుడు లేకపోవడం వల్లనే ప్రస్తుతం అసెంబ్లీలో ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆయ‌నే క‌నుక ఉంటే.. ముఖ్యమంత్రిగా త‌న ప‌ని సులువై ఉండేదని అన్నారు. నిబ‌ద్ధ‌త‌కు, విశ్వ‌స‌నీయ‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం రోశ‌య్య అంటూ ప్ర‌శంస‌లు గుప్పించారు.

ఇక‌, త‌న‌ను గుర్తించిన మొద‌టి వ్య‌క్తి రోశ‌య్యేన‌ని సీఎం రేవంత్ రెడ్డిచెప్పారు. త‌న‌లోని గుణాల‌ను మెచ్చి.. రాజ‌కీయంగా పైకి వ‌స్తావని ప్రోత్స‌హించార‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా రోశ‌య్య త‌న‌కు అనేక రూపాల్లో ఆద‌ర్శంగా నిలిచార‌ని పేర్కొన్నారు. ఆయ‌న ఆవేశ‌ప‌డ‌తార‌ని చాలా మంది అంటార‌ని.. కానీ, ఆవేశం క‌న్నా.. ఆలోచనే ముఖ్య‌మని త‌న‌తో అనేక సంద‌ర్భాల్లో రోశ‌య్య చెప్పార‌ని గుర్తు చేసుకున్నారు.

గ‌తంలో ముఖ్య‌మంత్రులుగా చేసిన వారంతా.. రోశ‌య్య కార‌ణంగానే ప్ర‌శాంతంగా ఉన్నార‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమ‌ల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తదితర ముఖ్యమంత్రులు అధికారంలో స్థిరంగా కొనసాగడానికి రోశయ్య చేసిన సేవలే కారణమని తెలిపారు. రోశయ్య 100 శాతం నిఖార్సైన హైదరాబాదీ అని, ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని తెలిపారు. ఆయ‌న విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తామ‌ని అన్నారు. అలాగే.. తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు విగ్ర‌హాన్ని కూడా హైద‌రాబాద్‌లో పెడ‌తామ‌ని అన్నారు.