అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేయడం ఎందుకని అలోచిస్తున్నారా..?? వినూత్న పోరాటాలతో వినుతికెక్కిన కాక్రోచ్ పార్టీ అధినేత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన యాదవ్ నిర్లక్ష్య వైఖరి మీద తన దైన శైల్లో వ్యంగంగా రాజీనామా లేఖను సంధించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్ లోని బాలాఘట్ జిల్లాలో జులై నుంచి 30 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందారు. వీరంతా మీజిల్స్, మలేరియా, శ్వాసకోశ వ్యాధులతో మరణించినట్లు వైద్యారోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. గిరిజన ప్రాంతాలను సందర్శించిన ప్రజా సంఘాలకు చేతి పంపుల నుంచి పసుపురంగు నీరు రావడం కనిపించింది. కలుషిత నీటితో పాటు సకాలంలో వైద్యం అందలేదని తేలింది. 50 పడకల ఆసుపత్రిలో 400 మందికి వైద్యం చేస్తుండటం కోర్టు దృష్టికి వచ్చింది.
ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబందించి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సరిగ్గా స్పందించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఈనెల 12 వ తేదీన కాక్రోచ్ అధినేత అభిజిత్ దీప్కే బాలాఘట్ జిల్లాలో పర్యటించారు. పిల్లలు మరణించినట్లు చెబుతున్న ఆడోరి, బోర్క, బొందరి గ్రామాలను సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గిరిజన పిల్లలు మరణించినట్లు ఆరోపించిన ఆయన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా పట్టించుకోక పోవడంతో అభిజిత్ తనదైన స్టైల్లో పంచ్ విసిరారు.
తనను తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గా చెప్పుకుంటూ…30 మంది పిల్లల మరణాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ లో పోస్టు పెట్టారు. రాజీనామా లేఖను గవర్నర్ కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. బాలాఘాట్ పిల్లల మరణాలు తన మనసును కలిచి వేశాయని, సీఎం పదవిలో ఉండడానికి తన మనసు అంగీకరించడం లేదని లేఖలో పేర్కొన్నారు. తాను వైఫల్యం చెందినట్లు అంగీకరించారు.ఈ లేఖ పొలిటికల్ సర్కిల్ లో తెగ వైరల్ అవుతుంది. దున్నపోతు మీద వాన కురిసినా చలించనట్లు వ్యవహరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీరును ఎండబెట్టారని దీప్కేను నెటిజన్లు అభినందిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates