నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అతడి హవా నడిచింది కానీ.. ఆపై అయిదారేళ్ల పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడీ టాలెంటెడ్ యాక్టర్. టొవినో థామస్, బాసిల్ జోసెఫ్, రోషన్ మాథ్యూస్ లాంటి యువ నటుల జోరు ముందు నిలవలేక మరుగున పడిపోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు.
ఐతే ఇక తన పనైపోయినట్లే అనుకుంటున్న సమయంలో గత ఏడాది సర్వంమాయ లాంటి ఫీల్ గుడ్ మూవీతో తన ఉనికిని చాటుకున్నాడు నివిన్. ఆ తర్వాత అతడి నుంచి వచ్చిన బేబీ గర్ల్, ప్రతిచాయ సినిమాలు ఫ్లాప్ కావడంతో నివిన్ ఒరిజినల్ ఫామ్‌లోకి వచ్చేశాడంటూ అతడి మీద సెటైర్లు పడ్డాయి. తన కొత్త చిత్రం బెత్లెహాం కుటుంబ యూనిట్ ప్రోమోలు బాగా అనిపించినా, ఆ చిత్రంపై విడుదలకు ముందు మరీ అంచనాలేమీ లేవు.
కానీ గత నెలలో ఇరుముడి రిలీజైన వీకెండ్లోనే విడుదలైన ఈ సినిమా సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. వారాలు గడుస్తున్నా ఆ సినిమా జోరు తగ్గలేదు. ముందు వంద కోట్ల మార్కును అందుకుంటేనే ఆశ్చర్యపోయారు. కానీ చూస్తుండగానే 200 కోట్ల మైలురాయిని దాటేసిన ఆ చిత్రం.. ఇప్పుడు ఏకంగా 300 కోట్ల క్లబ్బులో చేరడమే కాక.. కేరళ ఇండస్ట్రీ హిట్‌గానూ ఘనతను అందుకుంది. రూ.302 కోట్లతో గత ఏడాది రికార్డు నెలకొల్పిన లోకా చిత్రాన్ని ఈ సినిమా అధిగమించేసినట్లే. నాలుగో వీకెండ్లో కూడా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ మంచి కలెక్షన్లు వస్తున్నాయి.
కేరళ లాంటి చిన్న రాష్ట్రంలో ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, ఈ ఘనత అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో రూ.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ కాగా.. విదేశాల్లో మాత్రమే బెత్లెహాం కుడుంబ యూనిట్ రూ.130 కోట్లు కొల్లగొట్టడం విశేషం. పరిమిత బడ్జెట్లలో, తక్కువ రోజుల్లో పూర్తయ్యే మలయాళ చిత్రాలు వసూళ్లలో మాత్రం తెలుగు, హిందీ చిత్రాలతో పోటీ పడుతుంటాయి. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతుంటాయి. నివిన్ సరసన మామిత బైజు నటించిన బెత్లెహాం కుడుంబ యూనిట్ చిత్రాన్ని ప్రేమలు దర్శకుడు గిరీష్ ఏడీ రూపొందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates